శుక్రవారం ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024 లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశంలో ఉన్న ట్రక్కు డ్రైవర్లకు ఒక గుడ్‌న్యూస్ చెప్పారు. ట్రక్కు డ్రైవర్ల కోసం నేషనల్ హైవేల వెంబడి కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక సౌకర్యాలతో భవనాలను నిర్మించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ భవనాలు లక్షలాది మంది ట్రక్కు డ్రైవర్లకు ఉపయోగపడతాయని వెల్లడించారు. నేషనల్ హైవేలలో వందలు, వేల కిలోమీటర్ల పాటు సరకు, ఇతర వస్తువులను రవాణా చేసే ట్రక్కులను నడిపించే డ్రైవర్లు నిద్ర, విరామం లేకుండా ప్రయాణిస్తారని.. అలాంటి వారికి విశ్రాంతి లేకుండా పనిచేస్తుండటంతో రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.
అయితే అలాంటి ట్రక్కు డ్రైవర్ల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలోని అన్ని నేషనల్ హైవేలపై ప్రత్యేక భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. సుదూర ప్రయాణాలు చేసే డ్రైవర్లు సరైన విశ్రాంతి పొందేలా వెయ్యి బిల్డింగ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆ భవనాల్లో ఆహారం, నీరు, వాష్‌రూమ్స్, పార్కింగ్, విశ్రాంతి గదులతో పాటు మెరుగైన సౌకర్యాలతో ఆధునిక భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. మొదటి దశలో దేశవ్యాప్తంగా 1000 భవనాలను నిర్మించి ఆ తర్వాత మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మన దేశ ఆర్థిక వ్యవస్థలో వాహన రంగం చాలా కీలకమైన పాత్ర వహిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. అందుకే డ్రైవర్లే కారణం అని తెలిపారు. అలాంటి డ్రైవర్లు అదనపు గంటలు, విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేయడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని ప్రధాని గుర్తు చేశారు. అలాంటి వారి కోసమే ఈ భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. దేశంలో 2014కు ముందు పదేళ్లలో 12 కోట్ల వాహనాలు అమ్ముడైతే.. 2014 తర్వాత పదేళ్ల కాలంలో 21 కోట్ల వాహన కొనుగోళ్లు జరిగాయని తెలిపారు. ఇక పదేళ్ల క్రితం దేశంలో 2 వేల ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటే.. ప్రస్తుతం 12 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు చేరాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత దేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పరుగులు తీస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు. తాము వరుసగా మూడోసారి గెలిచి కేంద్రంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేందుకు ఆటో, ఆటోమోటివ్ పరిశ్రమది చాలా కీలక పాత్ర కానుందని పేర్కొన్నారు.