కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ స్తంభించిపోయింది. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర హోదా, రాజ్యాంగ రక్షణ కోరుతూ వేలాది మంది భారీ ప్రదర్శనకు దిగారు. లేహ్ అపెక్స్ కౌన్సిల్, కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్ సంయుక్తంగా ఈ నిరసన చేపట్టాయి. లడఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ను అమలు చేయడం, లేహ్, కార్గిల్ జిల్లాలకు ప్రత్యేక పార్లమెంటు స్థానాలను డిమాండ్ చేస్తూ గడ్డకట్టే ఉష్ణోగ్రతలను సైతం లెక్కచేయకుండా వేలాది మంది పురుషులు, మహిళలు వీధుల్లోకి వచ్చారు.
లేహ్ అపెక్స్ కౌన్సిల్, కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్ ప్రతినిధులతో రెండో విడత చర్చలు జరపాలని కేంద్రం ప్రకటించినప్పటికీ ఆందోళనకు దిగడం గమనార్హం. లడఖ్ ప్రజల డిమాండ్లను పరిష్కరించేందుకు ఇప్పటికే హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్రపాలిత ప్రాంతంలో అంతులేని బ్యూరోక్రాటిక్ పాలనలో జీవించలేరని, పూర్తి రాష్ట్ర హోదాలో ఎన్నుకున్న ప్రతినిధులు మాత్రమే తమ డిమాండ్‌ను నెరవేర్చగలరని స్పష్టం చేశారు. గత డిసెంబరులో కేంద్రం మొదటి సమావేశాన్ని లడఖ్‌లో నిర్వహించింది. లేహ్, కార్గిల్‌లోని రెండు కౌన్సిళ్ల డిమాండ్లను సమర్పించాలని కోరింది.
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను 2019 ఆగస్టు 5న రద్దుచేసిన కేంద్ర ప్రభుత్వం.. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. లడఖ్, జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడాన్ని రెండేళ్లలోనే అక్కడ ప్రజలు వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేహ్, కార్గిల్ అలయెన్స్ సంయుక్త పోరాటానికి దిగాయి. ఆర్టికల్ 370 వల్ల సంక్రమించిన తమ భూమి, ఉద్యోగాలు, ప్రత్యేక గుర్తింపు పరిరక్షణకు రాష్ట్ర హోదా, రాజ్యాంగ హామీలను డిమాండ్ చేస్తూ అనేక నిరసనలు నిర్వహించారు.