అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తికావడంతో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై బీజేపీ దృష్టిసారించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూసీసీ విధివిధానాల రూపకల్పనకు ఏర్పాటైన ఐదుగురు సభ్యుల కమిటీ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ముసాయిదాను అందజేసింది. ఈ నివేదికలో పలు కీలకాంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బహుభార్యత్వం, బాల్య వివాహాలపై నిషేధం, అన్ని మతాలకు చెందిన అమ్మాయిలకు ఒకే విధమైన వివాహ వయసు, విడాకులకు సంబంధించి ఒకే తరహా నిబంధనలు ఇందులో ఉన్నాయి.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ సమర్పించిన నివేదికను ఫిబ్రవరి 6న అసెంబ్లీ ముందుంచుతామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. యూసీసీ ముసాయిదా బిల్లు ఆమోదం కోసం సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశం కానుంది. ఇది ఆమోదం పొంది.. అమల్లోకి వస్తే స్వాతంత్య్ర భారత చరిత్రలో యూసీసీ తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుంది. అయితే, ఈ ముసాయిదాను ఉత్తరాఖండ్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయలేదు.
ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలు బయటకొచ్చాయి. మహిళలు, పురుషులకు సమాన వారసత్వ హక్కులు.. వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోని జంటలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు లభించవు. పెళ్లిళ్ల నమోదుకు గ్రామాల స్థాయిలోనూ ఏర్పాట్లు చేయనున్నాయి. అలాగే, అమ్మాయిలకు వివాహ వయసు పెంపుతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగలుగుతారని పేర్కొన్నారు. దత్తత హక్కులు ప్రతి ఒక్కరికీ ఉంటాయని, ముస్లిం మహిళలకూ ఇవి వర్తిస్తాయి. దత్తత ప్రక్రియనూ సరళీకరిస్తారు.
వీటితో పాటు హలాల్, ఇద్దత్ పద్ధతులపై నిషేధం.. సహజీవనం సాగిస్తున్నవారు ఆ మేరకు డిక్లరేషన్ తప్పనిసరి.. ఈ ముసాయిదా ప్రతిలో జనాభా నియంత్రణ అంశాన్ని మాత్రం చేర్చలేదు. అలాగే, అన్ని వర్గాలవారు కోర్టుల ద్వారానే విడాకులు పొందాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల మధ్య వివాదం నడుస్తుంటే వారి పిల్లలను అమ్మమ్మ/ నానమ్మ, తాతయ్యలకు అప్పగిస్తారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే.. భార్యకు అందే పరిహారంలో మృతుడి తల్లిదండ్రులకూ వాటా ఉంటుంది. ఒకవేళ భార్య మరో వివాహం చేసుకున్నా.. మొదటి భర్త మరణం వల్ల అందే పరిహారాన్ని అతడి తల్లిదండ్రులకు వాటా ఇవ్వాలి. ఒకవేళ భార్య చనిపోతే ఆమె తల్లిదండ్రులను చూసుకునేవారు లేకపోతే భర్తే ఆ బాధ్యతను తీసుకోవాలి. అయితే, జనాభాలో 3 శాతంగా ఉన్న ఎస్టీలను యూసీసీ పరిధి నుంచి మినహాయిస్తారు. అయితే, ఈ ముసాయిదాలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది.