అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు కలవరానికి గురిచేస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు విద్యార్థులు మృతిచెందడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా, ఓహియోలో భారతీయ అమెరికన్ విద్యార్థి శ్రేయాస్‌రెడ్డి బెణిగేరి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి కారణాలు తెలియరాలేదన్న పోలీసులు.. అంతకుమించిన వివరాలు వెల్లడించలేదు. మీడియా నివేదికల ప్రకారం శ్రేయాస్ సిన్సినాటిలోని లిండ్నర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుతున్నాడు.
తల్లిదండ్రులకు సమాచారం అందించామని, వారు భారత్ నుంచి రానున్నారని కాన్సులేట్ వర్గాలు వెల్లడించాయి. ‘ఒహియోలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి దురదృష్టవశాత్తూ మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.. పోలీసుల విచారణ జరుగుతోంది. ఈ దశలో హత్యగా అనుమానించలేదు.. అతడి కుటుంబంతో కాన్సులేట్ టచ్‌లో ఉంటూనే ఉంది.. వారికి సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తోంది’ అని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ పేర్కొంది. జార్జియా రాష్ట్రంలోని లిథోనియాలో ఇటీవలే వివేక్ సైనీ అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. జనవరి 30న ఇండియానాలో భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య కూడా మృతి చెందాడు.
నీల్ ఆచార్య పర్ద్యూ యూనివర్సిటీ విద్యార్ధి. టిప్పెకానో కౌంటీ కరోనర్ ఆఫీస్ ప్రకారం.. వెస్ట్ లాఫాయెట్‌లోని 500 అల్లిసన్ రోడ్‌లో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్టు సమాచారం వచ్చింది. అక్కడికి చేరుకున్న తర్వాత పర్డ్యూ యూనివర్సిటీ విద్యార్థి చనిపోయినట్టు నిర్దారించారు. విద్యార్థి తల్లి గౌరీ ఆచార్య, ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘మా కొడుకు నీల్ ఆచార్య జనవరి 28 నుంచి కనిపించకుండా పోయాడు.. అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు.. చివరిగా పర్డ్యూ యూనివర్సిటీలో దింపిన ఉబర్ డ్రైవర్ చూశాడు.. నీల్ గురించి వెతుకుతున్నాం.. మీకు ఏదైనా తెలిస్తే దయచేసి మాకు సహాయం చేయండి’ అని అభ్యర్ధించారు. జనవరి 29న జార్జియాలో భారతీయ విద్యార్ధి వివేక్ సైనీ దారుణ హత్యకు గురయ్యాడు. తాను పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తోన్న కన్వీనియన్స్ స్టోర్ వద్ద నిరాశ్రయుడైన ఓ వ్యక్తి సుత్తితో దాడిచేసి దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.