సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ కీలక సూచనలు చేసింది. చిన్న పిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించొద్దని, ప్రచారానికి సంబంధించి పనులనూ వారికి అప్పగించొద్దని హెచ్చరించింది. నినాదాలు చేయించడం, పాటలు పాడించడం, కరపత్రాలు పంచడం, పోస్టర్లు అతికించడం వంటి పనులు చేయించకూడదని తెలిపింది.
సోమవారం ఈమేరకు రాజకీయ పార్టీలకు ఆదేశాలు జారీ చేసింది. నేతలు చిన్నారులను ఎత్తుకోవడం, ర్యాలీల్లో వారితో ప్రచారం చేయించడం, వాహనాల్లో తీసుకెళ్లడం చేయొద్దని పేర్కొంది. ఎన్నికల సంబంధిత పనులు, కార్యకలాపాల్లో చిన్నారులను చేర్చుకోవద్దని ఎన్నికల అధికారులకు కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. బాల కార్మిక చట్టాలు సరిగ్గా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులదేనని వెల్లడించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.