జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసహాయ రాజకీయ నాయకుడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కోన్నారు. ఆంధప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సంయుక్త సమావేశాల్లో భాగంగా రెండో రోజు(మంగళవారం) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఉదయం తొమ్మిది గంటలకు రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు అసెంబ్లీ మీడియా పాయింట్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. ప్రజాక్షేమాన్ని కాంక్షించే వాళ్లే రాజకీయ పార్టీ పెట్టాలని మంత్రి సూచించారు. చిరంజీవి పార్టీ పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారని గుర్తు చేశారు . ఆ తప్పు సరిదిద్దుకొనేందుకే పవన్ పార్టీ పెట్టారనుకొన్నాము, చంద్రబాబు కోసం పార్టీ పెట్టారన్న విషయం బయటపడిందన్నారు. లోకేష్ అవినీతి పరుడని మాట్లాడిన పవన్ ఇప్పుడు వారితో అంటకాగుతున్నాడని ధ్వజమెత్తారు. ప్రజాసంక్షేమం అందించటంలో సీఎం వైయస్ జగన్ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. పేదరిక నిర్ములనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఎన్టీఆర్ ఫ్యామిలీకి ద్రోహం చేసిన చంద్రబాబుకు పవన్ వంతపాడుతున్నాడు. పేదలకు సాయం చేస్తున్న సీఎం వైయస్ జగన్ ఓడిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడని విమర్శించారు. అందుకే పవన్ అసహాయ రాజకీయ నాయకుడని మంత్రి అభివర్ణించారు.