ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు తమ నిరసనలతో హోరెత్తించారు. నిత్యావసర వస్తువుల ధరలపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టగా అందుకు స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. సభలో ఏం జరుగుతోంది తెలియని పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పీకర్ టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేక్ అనంతరం సభ పున:ప్రారంభమవగా.. మళ్ళీ వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. సైకో పోవాలి... సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. మళ్ళీ పోడియంపైకి వెళ్లి టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీనితో వారిపై వేటు పడింది.