జగన్ అరాచక పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇది ఎన్నికల నాటికి మరింత పెరిగి తుఫానుగా మారి ఆయన కొట్టుకుపోవడం ఖాయమని స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికలు ఆయనకు, ప్రజలకు మధ్య యుద్ధమని ప్రకటించారు. ఆయన్ను ఇంటికి పంపడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సోమవారం అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం గొండుపాలెం, సాయంత్రం ఏలూరు జిల్లా చింతలపూడిలో ‘రా...కదలిరా’ బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రాన్ని అన్నివిధాలా భ్రష్టు పట్టించిన సైకోను ఇంటికి పంపించకపోతే పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని హెచ్చరించారు. ‘ఏటా జాబ్ కేలెండర్‌కు ఎందుకు బటన్ నొక్కలేదు? రోడ్ల బాగు కోసం ఎందుకు బటన్ నొక్కలేదు? రైతుల ఆత్మహత్యలు ఆపడానికి, మెగా డీఎస్సీ కోసం ఎందుకు బటన్ నొక్కలేదు’ అని నిలదీశారు. రానున్న ఎన్నికల్లో ఓటు బటన్ నొక్కి జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మద్యనిషేఽధం, సీపీఎస్ రద్దు అంటూ బుగ్గలు నిమిరి హామీలిచ్చి.. గద్దెనెక్కాక మరచిపోయాడని ఆక్షేపించారు. నకిలీ మద్యం తాగి 30 వేల మంది చనిపోయారని, 30 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారని తెలిపారు.