ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి పలాస రైల్వేస్టేషన్‌లో 2వ నెంబరు ఫ్లాట్‌ఫారంపై అధికారులు సోదాలు చేశారు. ఒడిశా రాష్ట్రం బరంపురానికి చెందిన శంకరం మిశ్రా, గంజాం జిల్లా బాల్యకు చెందిన సరోజ్‌కుమార్‌సాహు.. నాలుగు బ్యాగులు పట్టుకుని అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ప్రశ్నించడంతో బ్యాగులు అక్కడే పడేసి పారిపోయే ప్రయత్నం చేశారు.
వెంటనే సిబ్బంది వారిని పట్టుకొని బ్యాగులు పరిశీలించగా మొత్తంగా 42 కిలోల గంజాయి పొట్లాలు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని.. ఆ ఇద్దరినీ అరెస్టు చేసి.. విశాఖపట్నం రైల్వే కోర్టులో హాజరుపరిచారు. గంజాయి, నల్లమందు, బంగారం అక్రమ రవాణా నేరమని.. దీనిపై నిరంతరం పర్యవేక్షణతో పాటు దాడులు చేస్తామని స్పష్టం చేసారు. రాత్రులు వెళ్లే రైళ్లలో అధికంగా తనిఖీలు చేయాలని సిబ్బందికి ఆదేశించామన్నారు. ఈ 42కిలోల గంజాయి విలువ రూ.10లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు కాశీబుగ్గ పోలీసులకు మరో ముఠా పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న నలుగురిని సోమవారం కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. గంజాయిని బ్యాగులో వేసుకొని ప్రయాణికుల్లా పలాస రైల్వేస్టేషన్ రోడ్డులో వెళుతుండగా.. ఆ సమయంలో అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులు తనిఖీ చేయగా గంజాయితో దొరికిపోయారు.