ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం.. ఆ బాధ్యత జగన్ సర్కార్‌దేనట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 06, 2024, 09:40 PM

ఏపీకి కేంద్రం ట్విస్ట్ ఇచ్చింది. పోలవరం బాధ్యతను కేంద్రం తీసుకున్నా ప్రాజెక్టును నిర్మించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసి బిల్లులు సమర్పిస్తే వాటిని చెల్లిస్తామని చెప్పారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఏపీ విభజన చట్ట ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని.. 2020 నుంచి ఇంతవరకూ నిర్మాణ విషయంలో ఎలాంటి పురోగతీ లేదన్నారు కనకమేడల. దానిని పూర్తిచేయడానికి ఎంత సమయం పడుతుంది? 2022 నుంచి ఇప్పటివరకు ఎన్ని పనులు జరిగాయి.. అందుకోసం ఎంత ఖర్చుచేశారు? అని అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.


ప్రాజెక్టు బాధ్యతలను కేంద్రం తీసుకున్నా నిర్మాణ బాధ్యతలు ఏపీ వద్దే ఉన్నాయన్నారు. 2020-21లో రూ.2,234 కోట్లు, 2021-22లో రూ.711 కోట్లు, 2022-23లో రూ.1671.34 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.737 కోట్లు ఇచ్చామన్నారు. 2020లో డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గుర్తు చేశారు. ఇప్పుడు 2024లో ఉన్నామని.. నాలుగేళ్లుగా పనులు స్తంభించాయన్నారు. డయాఫ్రం వాల్‌పై నివేదిక ఎప్పుడు వస్తుంది అని ప్రశ్నించారు. నేషనల్‌ హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) సాంకేతిక నిపుణుల బృందం దెబ్బతిన్న ఈ వాల్‌పై అధ్యయనం చేసిందని కేంద్రమంత్రి తెలిపారు. దాని పునరుద్ధరణకు ఉన్న ప్రత్యామ్నాయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయన్నారు. పాతదానికి మరమ్మతులు చేయాలని లేదా కొత్తది నిర్మించాలని ఎన్‌హెచ్‌పీసీ ప్రతిపాదించిందన్నారు. ఏ డ్యాంకైనా డయాఫ్రం వాల్‌ వెన్నెముకలాంటిది.. అందువల్ల దీనిపై అంతర్జాతీయ ఏజెన్సీల సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించామన్నారు.


ఆ సంస్థలు ఇచ్చే నివేదికల ఆధారంగా కేంద్ర జలసంఘం ఆమోదించే డిజైన్ల ప్రకారం ఏపీ ప్రభుత్వం డయాఫ్రం వాల్‌ పునరుద్ధరణ బాధ్యతలు చేపడుతుందన్నారు. జలాశయం భవిష్యత్తుకు సంబంధించిన ఈ విషయంపై తొందరపాటుతో నిర్ణయం తీసుకోలేమన్నారు. ప్రస్తుతం దానిపై కసరత్తు జరుగుతోందన్నారు. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందని కనకమేడల అడిగిన ప్రశ్నకు మాత్రం మంత్రి సమాధానం ఇవ్వలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com