అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుపుకుని ప్రారంభోత్సవం చేసుకోవడంతో ప్రస్తుతం దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా మందిరాలను కూల్చి మసీదులను నిర్మించిన వాటిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికే వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కింద భారీ హిందూ ఆలయం ఉండేదని.. దాన్ని కూల్చి మసీదును నిర్మించారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది. ఇక మథురలోని షాహీ ఈద్గా ఉన్న ప్రాంతంలో కూడా గతంలో శ్రీ కృష్ణుడి ఆలయం ఉండేదని.. దాన్ని కూల్చి వేసి మసీదును నిర్మించారనే వాదన ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. అది శ్రీ కృష్ణుడి జన్మస్థలంగా కూడా చెబుతూ ఉంటారు. అయితే ఆ షాహీ ఈద్గా ఉన్న ప్రాంతంలో శ్రీ కృష్ణుడి ఆలయాన్ని పడగొట్టి.. ఔరంగజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించారని.. తాజాగా ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా మెయిన్‌పురికి చెందిన అజయ్ ప్రతాప్ సింగ్ అడిగిన ప్రశ్నకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా - ఏఎస్ఐ సమాచారాన్ని అందించింది. అయితే గతంలో అక్కడ శ్రీ కృష్ణుడి ఆలయం ఉండేదని.. అయితే దాన్ని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు కూల్చేసి.. ఆ స్థానంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించినట్లు తెలిపింది. అయితే ఈ వివరాలను మథురలోని శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయ కాంప్లెక్స్‌కు సంబంధించి 1920 గెజిట్‌లోని చారిత్రక ఆధారాల ద్వారా వెల్లడించినట్లు ఏఎస్ఐ వెల్లడించింది.
బ్రిటీష్ పాలకుల హయాంలో 1920 లో ప్రచురితమైన గెజిట్ ఆధారంగా ఈ వివరాలను ఏఎస్ఐ వెల్లడించింది. మసీదు స్థానంలో అంతకుముందు కత్రా కేశవదేవ్ ఆలయం ఉండేదని.. దాన్ని కూల్చి మసీదును నిర్మించారని పేర్కొంది. ఈ వ్యవహారంపై శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి న్యాస్ అధ్యక్షుడు.. న్యాయవాది మహేంద్ర ప్రతాప్ స్పందించారు. బ్రిటిష్ హయాంలో పనిచేసిన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ బిల్డింగ్ అండ్ రోడ్ సెక్షన్ ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రదేశాల్లో ప్రచురించిన గెజిట్‌లో నమోదు చేసిన 39 స్మారక చిహ్నాల జాబితా ఉందని ఆయన తెలిపారు. ఈ జాబితాలో కత్రా కేశవ్ దేవ్ భూమి వద్ద ఉన్న శ్రీ కృష్ణ భూమి 37 వ స్థానంలో పేర్కొని ఉందని వెల్లడించారు. ఇంతకుముందు కత్రా గుట్టపై కేశవ్ దేవ్ ఆలయం ఉండేదని.. దాన్ని కూల్చివేసి.. మసీదును కట్టారని తెలిపారు.
అయితే మథురలో శ్రీ కృష్ణ ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ స్పష్టం చేసిందని.. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో సాక్ష్యంగా అందజేస్తామని మహేంద్ర ప్రతాప్ వెల్లడించారు. చారిత్రక ఆధారాల ప్రకారం 1670 లో అప్పటి మొఘల్ చక్రవర్తిగా ఉన్న ఔరంగజేబు ఆదేశాలతో శ్రీ కృష్ణుడి ఆలయాన్ని కూల్చి వేశారని.. ఆ తర్వాత అక్కడ షాహీ ఈద్గాను నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుతం మథురలో శ్రీ కృష్ణ జన్మభూమి - షాహీ ఈద్గా మసీదు వివాదం హైకోర్టులో ఉందని వెల్లడించారు. ఈ నెల 22 వ తేదీన తదుపరి విచారణ ఉందని.. సమాచార హక్కు చట్టం కింద ఏఎస్ఐ ఇచ్చిన నివేదికను ఆ రోజు హైకోర్టులో సమర్పిస్తామని మహేంద్ర ప్రతాప్ స్పష్టం చేశారు.