భారతీయ జనతా పార్టీని సంస్థా గతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టామని, అందులో భాగంగా గావ్ ఛలో అభియాన్ పేరుతో దేశంలో ఉన్న ఏడున్నర లక్షల పల్లెల్లో పర్యటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.... రెండు మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో సంస్థాగతంగా, రాజకీయంగా కూడా బీజేపీ అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఏపీలో ప్రతి పల్లెను తమ నేతలు, కార్యకర్తలు సందర్శిస్తారని చెప్పారు. పల్లెకు పోదాంలో భాగంగా ఏపీలో ఉన్న 21 వేల గ్రామాల్లో 24 గంటల పాటు అక్కడ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉంటారని పురందేశ్వరి తెలిపారు. అక్కడ స్థితిగతులు తెలుసుకుంటూ.. పరిస్థితులను అంచనా వేస్తారన్నారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుని రాష్ట్ర నాయకత్వానికి అందజేస్తారని తెలిపారు. ఈ అంశాలన్నిటిని జాతీయ నాయకత్వానికి నివేదిక రూపంలో అందజేస్తామన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ గ్రామాలకు వెళ్తున్నారని.. వారందరికీ పురందేశ్వరి అభినందనలు తెలిపారు. పల్లె ప్రజల పాట్లు తెలుసుకుని పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.