తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ తెలుగు అకాడమీ ఛైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవలే చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ లీడర్ అమిత్ షాతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య ఏపీ రాజకీయాలపై చర్చలు జరిగాయి. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు ఖాయమని, తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీయేలో చేరుతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అసలు అమిత్ షానే కలవలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి. అసలు ఆ గంట సమయం చంద్రబాబు ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు అంటేనే అవినీతి, అక్రమాలకు చిరునామా అని లక్ష్మీపార్వతి విమర్శించారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకీ, ఇప్పటి టీడీపీకి అసలు పోలికే లేదన్నారు. చంద్రబాబు దుర్మార్గాలను టీడీపీ కార్యకర్తలు గ్రహించి.. అతన్ని పార్టీ నుంచి తరిమేయాలని కోరారు. ఇదే క్రమంలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఆ గంటపాటు ఏమయ్యారో చెప్పాలని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ పార్లమెంటులో చెప్పగానే.. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారన్న లక్ష్మీపార్వతి.. గంట సేపు ఢిల్లీలో కనిపించలేదని అన్నారు. ఆ తర్వాత ఓ ఫేక్ సర్వే బయటకు వచ్చిందన్న లక్ష్మీపార్వతి.. అలాంటి వ్యవహారాలు మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఆరోపించారు. ఢిల్లీలో చంద్రబాబు అసలు అమిత్ షాను కలవలేదన్న లక్ష్మీపార్వతి.. ఒక్క ఫోటో అయినా చూపించాలంటూ ప్రశ్నించారు.
కుటుంబాల మధ్య చిచ్చుపెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని లక్ష్మీపార్వతి ఆరోపించారు. అప్పట్లో ఎన్టీఆర్‌కు, ఆయన పిల్లలకు మధ్యన చిచ్చుపెట్టాడని.. ఇప్పుడేమో జగన్ కుటుంబంలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్ని్స్తున్నాడని ఆరోపించారు. ఇక వైఎస్ షర్మిల దారి తప్పిన బాణమని, చంద్రబాబు ఇచ్చిన స్ర్కిప్టు చదవడమే ఆమె పని అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు చంద్రబాబు ఆస్తుల మీద కూడా లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు చంద్రబాబుకు రెండున్నర ఎకరాల ఆస్తి మాత్రమే ఉందన్న లక్ష్మీపార్వతి.. ఇన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం పక్కాఅని వ్యాఖ్యానించారు.