ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. షర్మిల రాక ముందు వరకూ స్తబ్దుగా ఉన్న హస్తం పార్టీ నేతలు.. వైఎస్ షర్మిల ఎంట్రీతో యాక్టివ్ అయ్యారు. అటు వైఎస్ షర్మిల సైతం జగనన్న అంటూనే.. సోదరుడిపై విమర్శల తూటాలు పేలుస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు, మంత్రుల నుంచి వైఎస్ షర్మిలకు కౌంటర్లు వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా చీఫ్ వైఎస్ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్‌ను మంత్రి రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే చంద్రబాబు, షర్మిల తీరుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మాదిరిగానే టీడీపీతో పాటు ఆ పార్టీతో కలిసి వచ్చే పార్టీలతో ఏపీ ఓటర్లు ఆడుకుంటారని రోజా సెటైర్లు పేల్చారు. ఓడించి హైదరాబాద్ తరిలిమేస్తారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో సీఎం ఫోటోలపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు తీవ్రస్థాయిలో బదులిచ్చారు రోజా. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం ఫొటో కాకుండా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫొటో పెట్టాలా అంటూ సెటైర్లు వేశారు. అలాగే టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన ప్రభుత్వ కార్యక్రమాలకు చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫొటోలు పెట్టారా అంటూ ప్రశ్నించారు. జగన్ ఫోటోలు చూస్తుంటే టీడీపీ నేతలకు కడుపుమంటగా ఉందని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలోనే వైఎస్ షర్మిలపైనా రోజా తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ మీద ఉమ్మేసేవారని చెప్పిన షర్మిల.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆ పార్టీలో చేరిందంటూ ప్రశ్నించారు. జగన్ ను జైలుపాలు చేసిన పార్టీతో చేతులు కలిపి అన్యాయం చేశారని మండిపడ్డారు. టూర్ లు పెట్టి ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ లో విలీనం ఎందుకు చేసిందో షర్మిల చెప్పాలన్నారు మంత్రి రోజా. ఏపీవ్యాప్తంగా టూర్ లు పెట్టి ప్రచారం చేస్తున్న షర్మిల , తెలంగాణలో పోరాటం చేస్తానని చెప్పి కాంగ్రెస్ లో విలీనం ఎందుకు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కుదిరితే తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి నుంచి... ఏపీకి రావాల్సిన 6 వేల కోట్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి రావాల్సిన లక్ష 80 కోట్ల ఆస్తులు తీసుకురావాలని సవాల్ చేశారు.
ఇక కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులలో స్ఫూర్తినింపేలా మంత్రి రోజా ప్రసంగించారు.చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలంటే కచ్చితంగా పోటీ పడాలని.. జింకను వేటాడేటప్పుడు పులి ఎంత ఏకాగ్రతతో ఉంటుందో... గెలవాలంటే అంతే కసి ఉండాలని సూచించారు. మీ అందరిలో క్రీడా స్ఫూర్తి నింపడమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అని చెప్పిన రోజా.. జగనన్నపై క్రీడాకారులు, క్రీడాభిమానులు అందరి అభిమానం ఉందన్నారు.