ఏపీలో పేదలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలానికి పదేళ్ల అనంతరం భూ యాజమాన్య హక్కు కల్పించే సవరణ బిల్లును మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టారు. దీనివల్ల ప్రభుత్వం మహిళల పేరిట ఇచ్చిన ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకొని.. పదేళ్ల తర్వాత అమ్ముకునేందుకు వీలుంటుందని మంత్రి తెలిపారు. ఈ బిల్లుకు ఆమోదం లాంఛనమే అని చెప్పాలి. మరోవైపు అసెంబ్లీలో మరో బిల్లును కూడా ప్రవేశపెట్టారు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఇతర విధానాల్లో చేరిన వారిలో క్రమబద్ధీకరణ పొందిన ఉద్యోగులకు.. అంతకు ముందున్న సర్వీసును పింఛను ప్రయోజనాలకు లెక్కించకూడదనే సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి దీన్ని ప్రవేశపెట్టారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ సవరణ చేసినట్లు ఆయన తెలిపారు.
ఏపీలో జ గన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో 30.61 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు కన్వేయన్స్ డీడ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు నడుస్తున్నాయి.
ఇలా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఆస్తిపై 10 ఏళ్ల తర్వాత సంపూర్ణ శాశ్వత హక్కులు లభిస్తాయని దస్తావేజుల్లో పేర్కొన్నారు. దీనికసోం ఏ ప్రభుత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) పొందాల్సిన అవసరం ఉండదని క్లారిటీ ఇచ్చారు పత్రాలపై ముద్రిస్తున్నారు. స్థలానికి సంబంధించి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులను వారి పేరు మీద చెల్లించుకోవచ్చని కూడా స్పష్టంగా డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిపై భవిష్యత్‌లో ఎటువంటి వివాదాలు, తగాదాలకు ఆస్కారం ఉండదు అంటున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్‌లో ఆ స్థలానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విలువ, భూసేకరణ ద్వారా ఆ భూమిని సేకరిస్తే ఉన్న విలువను కూడా ముద్రించడం విశేషం.