అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్ల కేశవస్వామి ఆలయంలో కలకలంరేగింది. అక్కడ ఉత్సవ విగ్రహాలతోపాటు శఠగోపం, ఆంజనేయస్వామి విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు కెమికల్స్ చల్లారు. ఆలయంలో గర్భగుడి ప్రధాన ద్వారం ఇనుప ఊచలతో ఉండటంతో వాటి మధ్యనున్న ఖాళీల నుంచి కొందరు వ్యక్తులు గురువారం సాయంత్రం కెమికల్ పడేటట్లు స్ప్రే చేసినట్లు అర్చకులు నరసింహాచారి గుర్తించారు. ఆలయంలోని ద్వారాలు తెరిచే సరికి దుర్వాసన రావడంతో పాటు విషంతో కూడిన కెమికల్ విగ్రహాలపై పడినట్లు గమనించారు.
అ్చకులు వెంటనే ఈ విషయాన్ని ఆలయాధికారి ఎన్.సతీష్‌కు ఫోన్ చేసి తెలియజేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్థానికులతో కలిసి నిర్ణయించారు. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలున్నా ఎనిమిది నెలలుగా పనిచేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. భజరంగ్‌దళ్ సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా విగ్రహాలపై కెమికల్స్ చల్లడం స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇదంతా ఆకతాయిల పనిగా అనుమానిస్తున్నారు.