అయోధ్య రామయ్యను దర్శించాలనుకునే ఏపీవాసులకు గుడ్ న్యూస్. మిమ్మల్ని ఆ రామయ్య చెంతకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక సర్వీసులు ప్రారంభించింది. భవ్య రామమందిరంలో కొలువైన బాలక్‍రామ్‌ను దర్శించుకునేందుకు ఇప్పటికే దేశం నలుమూలల నుంచి వేల మంది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. బాలరాముణ్ని దర్శించుకుని తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్య తరగతి జనాలకు అందుబాటులో ఉండే విధంగా వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు రైలు సర్వీసులు నడుపుతోంది ఇండియన్ రైల్వే. అందులో భాగంగానే ఇప్పుడు ఏపీ నుంచి కూడా రెండు ప్రత్యేక సర్వీసులు నడుస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్ళాలనుకుంటే ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు ఓ రైలు సర్వీస్ నడుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. గుంటూరు నుంచి అయోధ్యకు ఇప్చటికే ఒక ప్రత్యేక రైలు నడుస్తోంది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఈ రైలును ఇటీవలే ప్రారంభించారు. ఏపీ నుంచి అయోధ్యకు వెళ్తున్న తొలి రైలు సర్వీసు కూడా ఇదే కావటం విశేషం. గుంటూరు నుంచి బయల్దేరే ఈ స్పెషల్ ట్రైన్.. విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, వైజాగ్ మీదుగా అయోధ్యకు చేరుకుంటుంది.
అయితే ఈ రైలుకు అదనంగా మరో స్పెషల్ ట్రైన్‌ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 11వ తేదీన ఈ రైలు తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. సామర్లకోటలో ప్రారంభమయ్యే ఈ రైలు.. పిఠాపురం, తుని, అనకాపల్లి, విశాఖపట్నం మీదుగా అయోధ్యకు చేరుకోనుంది. మొత్తానికి ఏపీ నుంచి రెండు రైలు సర్వీసులు అయోధ్యకు నడుపుతూ ఉండటంతో రామభక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతోనే ఆ రామయ్యను దర్శించుకుని తరిస్తామని ఆనందపడుతున్నారు. అయితే ఇంతకుముందు ఏపీ నుంచి నేరుగా అయోధ్యకు రైలు సర్వీసులు అందుబాటులో లేవు. మధ్యలో స్టేషన్లు మారాల్సి వచ్చేది. అయితే ఇకపై ఆ అవసరం లేకుండా పోవటంతో భక్తులు సంబరపడుతున్నారు.