కాకినాడ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి ఎస్‌బీఐ శాఖలో భారీ చోరీ జరిగింది. ఈ బ్యాంకుకు చోరీకి వచ్చిన దొంగలు భవనం వెనుక వైపు ఉన్న కిటికీని గ్యాస్‌కట్టర్‌తో తొలగించి లోపలికి వచ్చారు. సీసీ కెమెరాలు పనిచేయకుండా తీగలనూ తొలగించారు. బ్యాంకులో ఉన్న రెండు చెస్ట్‌లను కట్టర్‌తో ధ్వంసం చేసి డబ్బులు, బంగారాన్ని చోరీ చేశారు. గ్యాస్ కట్టర్‌కు ఉపయోగించిన సిలిండర్లను లోపలే వదిలేసి పారిపోయారు. సిబ్బంది గురువారం బ్యాంకు తెరిచాక చోరీ వ్యవహారాన్ని చూసి విస్తుపోయారు. దొంగతనం జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
భారీ చోరీ కావడంతో ఎస్పీ సతీష్‌కుమార్, అదనపు ఎస్పీ భాస్కర్, ట్రైనీ ఐపీఎస్ నవజ్యోత్, క్లూస్‌టీం సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఐదారుగురు ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రూ.75 లక్షల విలువైన డబ్బు, బంగారం చోరీ చేసినట్లు బ్యాంకును పరిశీలించిన ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. బ్యాంకు అధికారులు లెక్కలు తేల్చాక చోరీ మొత్తం ఇంకా పెరుగుతుందన్నారు. అయితే రూ.కోటికి పైగానే చోరీ జరిగినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్ానాయి. బ్యాంకుకు సమీపంలో షాపు దగ్గర ఉన్న సీసీ కెమెరాలో దొంగల కదలికలు రికార్డు అయినట్లు చెబుతున్నారు.
రాత్రి 12 గంటల వరకూ ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. అందులో రహదారుల కూడలిలోని బ్యాంకు శాఖను దోపిడీ చేయడం సంచలనంగా మారింది. బ్యాంకు తలుపులు వేసినవి వేసినట్టే ఉంటే.. నేరుగా బ్యాంకులో డబ్బులు, బంగారం భద్రపరిచే చెస్టులున్న గదికే దొంగలు వెళ్లడం ముందుగా వేసుకున్న ప్లాన్ అంటున్నారు. బ్యాంకు వెనుక ఉన్న పంటకాలువ వైపు నుంచి.. రెండు గ్యాస్ బండలు, కట్టర్లతో భవనం ప్రహరీ దాటి, వెనుక ఉన్న ఒక కిటికీని కట్‌చేసి దొంగలు చొరబడ్డారు.