ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎస్‌ను వదిలేసి.. రైతుల కోసం శాస్త్రవేత్తగా మారిన ఎంఎస్ స్వామినాథన్

national |  Suryaa Desk  | Published : Fri, Feb 09, 2024, 10:35 PM

కొన్ని నెలల క్రితమే మరణించిన హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కు మరణానంతరం భారతరత్న అవార్డు లభించింది. భారత దేశ వ్యవసాయ రంగం ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన ఎంఎస్ స్వామినాథన్‌కు తాజాగా అత్యున్నత పౌరపురస్కారం దక్కింది. ప్రస్తుతం భారత దేశం ధాన్యం నిల్వల్లో స్వయం సమృద్ధి సాధించి ఇతర దేశాలకు కూడా ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను ఎగుమతి చేస్తుందంటే దానికి కారణం.. ఎంఎస్ స్వామినాథన్ చేసిన పరిశోధనలు, తీసుకువచ్చిన సమూల మార్పులే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హరిత విప్లవాన్ని తీసుకువచ్చి దేశంలోని పంట పొలాల ముఖచిత్రాన్ని మార్చేశారు. దేశ అభివృద్ధికి పాడి పంటలు ప్రధానమని నిరూపించిన మహనీయుడు.


ఎంఎస్ స్వామినాథన్ పూర్తి పేరు.. మాన్‌కొంబు సాంబశివన్‌ స్వామినాథన్‌. 1925 ఆగస్టు 7 వ తేదీన తమిళనాడులోని కుంభకోణంలో పుట్టారు. ఎంఎస్ స్వామినాథన్‌కు 15 ఏళ్ల వయసు ఉండగానే.. ఆయన తండ్రి చనిపోవటంతో అప్పటికే వారి కుటుంబం నిర్వహిస్తున్న ఆస్పత్రిని చూసుకునేందుకు ఎంస్ స్వామినాథన్ వైద్య విద్యను చదవాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో దారుణ క్షామాన్ని చూసిన స్వామినాథన్‌.. ఆకలితో దేశంలో ఎవరూ చనిపోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వైద్య విద్యను చేయనని తన కుటుంబానికి తేల్చి చెప్పారు. అనంతరం కోయంబత్తూరులోని మద్రాసు అగ్రికల్చర్‌ కాలేజీలో ప్రవేశం పొందారు. అగ్రికల్చర్‌ కోర్సు చదవడమే అవమానంగా భావించే సమయంలో ఆ కోర్సు చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు.


అగ్రికల్చర్‌ కోర్సులో జెనెటిక్స్, పంటలు, వాటి దిగుబడులు పెంచేందుకు అవలంబించాల్సిన విధానాల వైపు.. ఎంఎస్ స్వామినాథన్ అడుగులు వేశారు. పురుగులు, చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడిని అందించే వంగడాలను.. మన దేశానికే కాకుండా యావత్‌ మానవాళికి మేలు జరుగుతుందని ఆయన నమ్మారు. ఈ క్రమంలోనే పీజీ పూర్తయ్యాక యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అఖిల భారత సర్వీసులైన ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అయితే అదే సమయంలో హాలెండ్‌లో అగ్రికల్చర్ కోర్సు చదివేందుకు ఆయనకు అవకాశం వచ్చింది. దీంతో అక్కడికి వెళ్లిన ఎంఎస్ స్వామినాథన్.. బంగాళదుంప జన్యు పరిణామంపై పరిశోధనలు చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ సాధించారు. అయితే విస్కాన్సిన్‌ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ అధిక జీతంతో భారీ ఆఫర్‌ ఇచ్చినా దాన్ని తిరస్కరించి.. 1954 లో కటక్‌లోని కేంద్ర వరి పరిశోధన సంస్థలో చేరారు. ఆ తర్వాత భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో అడుగు పెట్టారు.


అయితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేసరికి ఏటా 60 లక్షల టన్నుల గోధుమలు మాత్రమే పండేవి. ఆ సమయంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటేనే దేశ అవసరాలకు సరిపోయేవి. 1966 లో కరవు కారణంగా కోటి టన్నుల గోధుమల్ని అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం భారత దేశ వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్నే మార్చాలని స్వామినాథన్‌ నిర్ణయించుకున్నారు. అదే హరిత విప్లవానికి అడుగులు పడింది. ఇక ఈ హరిత విప్లవంలో భాగంగా అధిక దిగుబడులు ఇచ్చే వంగడాల తయారీ, ట్రాక్టర్ల వాడకం, సాగునీటి సదుపాయాలు కల్పించడం, ఎరువులు, పురుగుమందుల వాడకం, సాగు చేసే భూ విస్తీర్ణాన్ని భారీగా పెంచడం చేశారు. 1967 నుంచి 1978 మధ్య దేశ వ్యవసాయ పరిస్థితిలో భారీ మార్పు ప్రారంభం అయింది. వరి, గోధుమ సహా ఇతర పంటలపై స్వామినాథన్‌ జరిపిన విశేష కృషితో దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది.


ఆ తర్వాత అధిక దిగుబడులను ఇచ్చే గోధుమ వంగడాల కోసం పరిశోధనలు ప్రారంభించారు. మెక్సికోలో తయారు చేసిన గోధుమ వంగడాలను భారత్‌లో తయారుచేయటం మొదలుపెట్టారు. ఆ ప్రయత్నం ఫలించి హెక్టారుకు 2 టన్నుల దిగుబడి వచ్చే గోధుమలు నాలుగున్నర టన్నుల దిగుబడికి పెరిగింది. దీంతో హరిత విప్లవ పితామహుడిగా స్వామినాథన్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇక దేశ వ్యవసాయ రంగానికి ఎంతో కృషి చేసిన ఎంఎస్ స్వామినాథన్‌కు అనేక అవార్డులు వరించాయి. 1971 లో రామన్‌ మెగసెసే, 1986 లో రాబర్ట్‌ ఐన్‌స్టీన్‌ వరల్డ్‌ సైన్స్‌, 1991 లో ఎన్విరాన్‌మెంటల్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారాలు వచ్చాయి. ఇక దేశంలో అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ కూడా అందుకున్నారు. 1987లో వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ ఎంఎస్ స్వామినాథన్‌కు లభించింది. ప్రపంచంలోని ప్రముఖ యూనివర్సిటీల నుంచి 84 గౌరవ డాక్టరేట్‌లు వచ్చాయి. 20 వ శతాబ్దంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా టైం మ్యాగజైన్‌ ఎంఎస్ స్వామినాథన్‌ను గుర్తించింది. 2007 నుంచి 2013 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఆయన కొనసాగారు. ఇక గతేడాది సెప్టెంబర్‌ 28 వ తేదీన 98 ఏళ్ల వయసులో చెన్నై తేనాంపేటలోని ఆయన నివాసంలో ఎంఎస్ స్వామినాథన్ తుదిశ్వాస విడిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com