ప్రధాని నరేంద్ర మోదీతో పొత్తు ఉన్నందునే సీఎం జగన్‌కు కేంద్రం క్లీన్‌చిట్ ఇస్తోందని రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇసుక, మద్యం వ్యాపారాల్లో బీజేపీకి వాటాలు అందుతున్నాయని.... అందుకే జగన్, ఆయన మంత్రివర్గ సభ్యులపై సీబీఐ, ఈడీ కేసులు ఉండట్లేదన్నారు. పైగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దాటేస్తున్నా రాష్ట్రానికి కేంద్రం ఎడాపెడా అప్పులకు ఆమోదం తెలుపుతోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో నగదు చెల్లింపులతో మద్యం విక్రయాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీశారు. ఇసుక అమ్మకాలపై కూడా కేంద్రం స్పందించడం లేదన్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్‌తో సహా మోదీని వ్యతిరేకించిన వారందరిపైనా సీబీఐ, ఈడీ కేసులు పెడుతున్నారని తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారం కోల్పోతే ఆమె జైలుకెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయలక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, సోషల్ మీడియాలో దుర్భాషలాడుతున్నా జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదని కేవీపీ ప్రశ్నించారు.