డీఎస్సీ-2024లో భర్తీ అయ్యే టీచర్లకు రెండేళ్ల పాటు అప్రెంటీస్ ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. అప్రెంటీస్ కాలంలో బేసిక్ జీతంలో మొదటి ఏడాది 50 శాతం, రెండో ఏడాది 60 శాతం పారితోషికంగా వారికి అందుతుందని పేర్కొంది. పాఠశాల విద్యాశాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ మేరకు తెలిపింది. కొత్త నోటిఫికేషన్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 2 వేలు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,060 భర్తీ చేయనున్నట్టు తెలిపింది. ఇక ఏపీ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్ 15, మోడల్ స్కూల్ పీజీటీ 23, మోడల్ స్కూల్ టీజీటీ 248, ఏపీఆర్‌ఎస్ ప్రిన్సిపాల్ 4, ఏపీఆర్‌ఎస్ టీజీటీ 118, సాంఘిక సంక్షేమ శాఖలో టీజీటీ 386.. ఇలా పలు పోస్టులు పొందుపరిచారు. మొత్తం 6,100 పోస్టులకు ఈ నెల 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.