‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా శుక్ర వారం నారా భువనేశ్వరి నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పర్యటించారు. ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన ఆమె తొలుత కంచికచర్లలోని ఉమా నివాసానికి వచ్చిన ఆమె ఉమా సోదరుడు చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రశేఖర్ సతీమణి పల్లవి, కుమారుడు సూర్య ప్రదీత్, కుమార్తె సిరిచందనను ఓదార్చారు. ఉమ తల్లి సీతమ్మ, ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం నందిగామ మీదగా చందర్లపాడు మండలం కోనాయపాలెం చేరుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్థాపానికి గురై మృతి చెందిన వనపర్తి మల్లికార్జునరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లికార్జునరావు భార్య కస్తూరి, ఆయన కుమార్తెలను ఓదార్చారు. తెలుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయామన్న బాధ కలుగుతుందని భువనేశ్వరి అన్నారు. మీ త్యాగాలను, మీ అభిమానాన్ని ఎప్పటికీ మరువలేమన్నారు. మూడు లక్షల రూపాయల చెక్కును మల్లికార్జునరావు సతీమణికి అందజేశారు. అనంతరం జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలుకు చెందిన అలవాల గోపయ్య, గౌరవరానికి చెందిన కుక్కల ప్రకాశ్‌రావు, బలుసుపాడుకు చెందిన గండమాల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.