తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టనున్న ‘శంఖారావం’ యాత్రకు సర్వం సన్నద్ధమైంది. 13న పాలకొండ, కురుపాం, 14న పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో లోకేశ్ శంఖారావం సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. సభల విజయవంతానికి కసరత్తు చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో లోకేశ్ పర్యటనకు ప్రజల నుంచి భారీ స్పందన రావడంతో జిల్లాలో టీడీపీ కార్యకర్తలు, నేతలు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. మన్యంలోనూ శంఖారావం కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా లోకేశ్ వస్తుండడంతో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.