ఏపీ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ పాలిటిక్స్ కొత్త మలుపు తిరిగాయి. అప్పటి వరకూ టీడీపీ, జనసేన పార్టీలు మాత్రమే కూటమిగా వెళ్తాయని.. ఈసారి కమలం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. దీనికి తగినట్లుగానే ఏపీ బీజేపీ నేతలు సైతం కార్యాచరణ చేపట్టారు. అయితే ఊహించని విధంగా చంద్రబాబుకు ఢిల్లీ నుంచి పిలుపు రావటం ఏపీ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. కమలం పార్టీ పెద్దలే తమ అధినేతను ఢిల్లీకి పిలిచారని, ఎన్డీయే కూటమిలోకి టీడీపీ చేరికపై అమిత్ షా చర్చించారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే చంద్రబాబు పర్యటన తర్వాత సీఎం జగన్ హస్తినకు వెళ్లటం మరో టర్న్ అని చెప్పొచ్చు.
ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కలిశారు. అయితే పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారని ప్రభుత్వ వర్గాలు, వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. కానీ చంద్రబాబు హస్తిన నుంచి తిరిగొచ్చిన వెంటనే, జగన్ ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ నేతలు, జగన్ మధ్య రాజకీయంపైనా చర్చలు జరిగి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో అమిత్ షా.. చంద్రబాబు ఎదుట ఓ ప్రపోజల్ పెట్టారనే వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. టీడీపీని ఎన్డీయేలోకి చేర్చుకునేందుకు అంగీకరిస్తూనే.. సీట్ల పంపకంలో చంద్రబాబు ముందు 4:2:1 ఫార్ములాను కమలం పార్టీ పెద్దలు పెట్టినట్లు సమాచారం. పొత్తుకు అంగీకరిస్తూనే ఏపీ వ్యాప్తంగా 4:2:1 నిష్పత్తిలోనే సీట్ల పంపకాలు జరగాలని బీజేపీ మెలిక పెట్టినట్లు తెలిసింది.
ఏంటీ 4:2:1 ఫార్ములా?
4:2:1 ఫార్ములా అంటే ఏపీలోని అసెంబ్లీ సీట్లను ఆ నిష్పత్తి లెక్కన పార్టీల మధ్య పంచుకోవాలనే ప్రతిపాదన. ఏపీలోని మొత్తం శాసనసభ స్థానాలు 175 కాగా.. ఈ ఫార్ములా ప్రకారం కూటమిలో పెద్దన్నలాంటి టీడీపీకి వంద సీట్లు, ఇక ఇప్పటికే ఎన్డీయేలో ఉన్న జనసేనకు 50 సీట్లు, బీజేపీకి 25 సీట్లు ఇవ్వాలనేది ప్రతిపాదన. అలాగే ఈ ఫార్ములాను ప్రతి పార్లమెంట్ పరిధిలో అనుసరించాలని, ఆ లెక్కన సీట్ల పంపకం ఉండాలని అమిత్ షా ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదన ప్రకారం టీడీపీ వంద ఎమ్మెల్యే స్థానాలు, 14 ఎంపీ స్థానాల్లో పోటీకి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.
చంద్రబాబు నెక్ట్స్ స్టెప్ ఏంటీ?
అయితే కమలం పార్టీ 4:2:1 ప్రతిపాదనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. హస్తిన నుంచి రాగానే పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ సైతం ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకుని ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. వీరిద్దరి మధ్య మంగళవారం (ఫిబ్రవరి 13) మరో దఫా చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. 4:2:1 నిష్పత్తి ప్రకారం కాకపోయినా జనసేన, బీజేపీ రెండు పార్టీలకు కలిపి కనీసం 50 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలని బీజేపీ పెద్దలు గట్టిగా పట్టుబడుతున్నారట. ఇక బీజేపీ అయితే ఎమ్మెల్యే స్థానాల కంటే ఎంపీ స్థానాలకే ఎక్కు వ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేనకు 28, బీజేపీకి 6 నుంచి 8 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని టీడీపీ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య జరిగే తదుపరి చర్చల్లో సీట్ల పంపకంపై ఓ క్లారిటీ రానుంది.