నగరి పర్యటనలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనపై చేసిన ఆరోపణలపై మంత్రి రోజా రియాక్టయ్యారు. షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన రోజా.. రాజన్న నిజమైన బిడ్డ వైఎస్ జగన్ మాత్రమే అని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ ఆశయాల కోసం జగన్ పనిచేస్తుంటే.. షర్మిల మాత్రం చంద్రబాబు ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరి మధ్య తేడాలను గుర్తించాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ ఆశయాల కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా తలొగ్గక పనిచేసేది జగనన్న అయితే.. వైఎస్ఆర్ ఆస్తుల కోసం పనిచేసేది షర్మిల అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
" నేను వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకోవటం తప్ప.. వైఎస్ఆర్‌కు పేరు తెచ్చే విధంగా ఏమైనా మంచిపని చేశారా.. మొన్నటి వరకూ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టి.. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే పెళ్లిచేసుకున్నా.. చనిపోయేవరకూ తెలంగాణ ప్రజలకు సేవచేస్తా అన్నారు. ఇప్పుడేమో ఆ పార్టీని గాలికొదిలేసి వైఎస్ఆర్ కుటుంబాన్ని, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన పార్టీ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన పేరు ఎఫ్ఐఆర్‌లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ. ఏపీకి ప్రత్యేక హోదా లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీతో చేరి జగనన్న మీద విషం చిమ్ముతున్నారు. వైఎస్ఆర్ నిజమైన బిడ్డ జగనన్న మాత్రమే" అని రోజా అన్నారు.
"తన తండ్రిపేరు పేద ప్రజల గుండెల్లో కలకాలం ఉండేలా మంచిపనులు చేస్తూ, ఎన్ని కష్టాలు ఎదురైనా, జైళ్లో పెట్టినా కూడా వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న వ్యక్తి జగనన్న. కానీ షర్మిల మాత్రం కాంగ్రెస్‌లో చేరి వైఎస్ఆర్ ఆత్మను క్షోభ పెడుతోంది. చంద్రబాబు వదిలిన బాణం షర్మిల. ఓట్లను చీల్చి చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చాలనేదే ఆమె ప్రయత్నం . వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేసేది జగనన్న అయితే వైఎస్ఆర్ ఆస్తుల కోసం పనిచేసేది షర్మిల. రాజన్న నిజమైన బిడ్డ సీఎం జగన్ మాత్రమే " అంటూ మంత్రి రోజా వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం నగరిలో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల.. రోజా మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబంతో కలిసి నగరిలో రోజా పెద్దఎత్తున భూ కబ్జాలకు పాల్పడిందంటూ ఆరోపించారు. నగరిలో రోజా జబర్దస్త్ దోపిడీ సాగించిందన్న షర్మిల.. ఇసుక, మట్టి, గ్రానైల్ ఇలా అన్నింటినీ దోపిడీ చేశారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా.. వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.