శంఖారావం యాత్ర చేపట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సిద్ధం.. సిద్ధం అంటున్న జగన్ దేనికి సిద్ధం.. జైలుకు పోవటానికా అంటూ జగన్‌ను ఎద్దేవా చేసిన లోకేష్.. యాత్రలో మళ్లీ రెడ్ బుక్ ప్రస్తావన తెస్తున్నారు. చట్టాలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడిన అధికారుల పేర్లు ఇందులో రాస్తున్నామన్న నారా లోకేష్.. తాము అధికారంలోకి వస్తే అందరి సంగతీ తేలుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సోమవారం శంఖారావం బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభ వేదికగా సీఎం జగన్ మీద.. లోకేష్ మరోసారి విరుచుకుపడ్డారు.
వైనాట్175 అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తున్న వైసీపీ అధిష్ఠానం.. అందులో భాగంగా పలుచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త ఇంఛార్జులను నియమిస్తోంది. దీనిపైనే విపక్షాలు వైసీపీ మీద విమర్శలు సంధిస్తున్నాయి. ఈ క్రమంలో లోకేష్ కూడా దీనిపై సెటైర్లు వేశారు. సీఎం జగన్ ప్రపంచంలో ఎక్కడా లేని పథకం తీసుకొచ్చారన్న లోకేష్.. ఆ పథకం పేరే ఎమ్మెల్యేల ట్రాన్స్‌ఫర్ అంటూ ఎద్దేవా చేశారు. ఒక నియోజకవర్గంలో పనిచేయని వారు మరో నియోజకవర్గంలో పని చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్ ఓటమిని అంగీకరించారని అన్నారు. దిల్లీలో వైసీపీ ఎంపీలు కూడా ఆయనకు బైబై చెప్తున్నారని విమర్శించారు.
ఏపీ నుంచి వైసీపీకి 31 మంది ఎంపీలు ఉంటే.. ఆ ఎంపీలను కూడా కేసుల మాఫీ కోసం కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ లోకేష్ మండిపడ్డారు. ఎంపీలకు కూడా వైఎస్ జగన్ మీద నమ్మకం పోయిందనీ.. అందుకే ఇటీవల జగన్ ఢిల్లీకి వెళ్తే ఆయన వెంట కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారని అన్నారు. వచ్చేది టీడీపీ, జనసేన ప్రభుత్వమేనన్న లోకేష్.. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ ఉద్యోగ కల్పనలో ఆలస్యమైతే నెలకు మూడు వేల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని లోకేష్ అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నామన్న లోకేష్.. అవసరమైతే అధికారంలోకి వస్తే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు.