ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారి ప్రసాదంలో ఎముక వచ్చినట్లు ఓ భక్తుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ప్రసాదంలో ఎముక ప్రత్యక్షమైందంటూ జరిగిన ప్రచారం అవాస్తవం అన్నారు. అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు మార్కండేయశాస్త్రి, వేదపండితులు గంటి రాధాకృష్ణ శర్మ వెల్లడించారు. పాకశాలలో తయారు చేసే రోజూవారి ప్రసాదాలు నియమనిష్ఠలతో, శుచీశుభ్రతలతో ప్రధానార్చకుల పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. అమ్మవారి ఆలయ ఆలయ ప్రాంగణంలో గల పాకశాలలో పులిహోర ప్రసాదంలో ఎముక వచ్చిందనేది వాస్తవం కాదన్నారు.
ఈ ఘటన తమకు ఎంతో మనోవేదనకు గురి చేసిందన్నారు. దీనిపై పలు అనుమానాలు కూడా ఉన్నాయన్నారు. శ్రీశైలక్షేత్ర ప్రతిష్ఠను దెబ్బతీసి భక్తుల మనోభావాలను కించపరిచేందుకే ఇలాంటి వార్తలు వస్తున్నాయన్నారు. ఇలాంటి ఘటనలపై భక్తులు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. ఆలయంలో తీసుకున్న పులిహోర ప్యాకెట్‌లో కనిపించిన గుర్తు తెలియని వస్తువులను ఎముకలుగా భావించి భక్తుడు ఫిర్యాదు చేశారన్నారు. రోజువారి ప్రసాదాల తయారీ కూడా ప్రధాన అర్చకుల పర్యవేక్షణలోనే జరుగుతుందన్నారు. భక్తుడు దాల్చిన చెక్క ముక్కలను చూసి ఎముకలుగా భావించారని.. ఆలయ కమిటీ విచారణలో ఆయన మాటలు అబద్ధమని తేలిందన్నారు. శ్రీశైలం ఆలయంలో ప్రసాదాల తయారీలో ఎప్పుడూ ప్రామాణికమైన నిర్వహణ విధానాలు పాటించడం వల్ల ఇలాంటి అపవిత్ర చర్యలకు ఆస్కారం ఉండదన్నారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవి పవిత్ర పుణ్యక్షేత్రం అయిన.. ఈ చారిత్రాత్మకమైన శ్రీశైలం పవిత్రతను కాపాడటానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నామని చెప్పారు. శ్రీశైలం దేవస్థానం నిర్వహణను విశ్వసించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ విజ్ఞప్తి చేశారు ఈవో పెద్దిరాజు.
నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మల్లన్న దర్శనానంతరం భక్తులకు నిత్యప్రసాద వితరణలో పులిహోరను అందించారు. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వేణుగోపాల్ అతని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రసాదం తింటున్నప్పుడు నోటికి గట్టిగా తగిలిందని, కొరికితే అది రెండు ముక్కలైందని ఏమిటని చేతిలో వేసి చూడగా అది మాంసం ఎముకగా గుర్తించామని భక్తుడు వేణుగోపాల్ తెలిపారు. ఈ విషయాన్ని ఆలయ ఏఈవోకు ఫిర్యాదు చేశారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయంలో తను చూసిన ఆధారాలను అందించాడు. దీంతో శ్రీశైలం దేవస్థానం నిర్వాహకులు సత్వరమే స్పందించి విచారణకు ఆదేశించారు. భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. పులిహోరలో వాడిన దాల్చిన చెక్కలను చూసిన భక్తుడు ఎముకలుగా భావించారని ఆలయ కమిటీ విచారణలో తేలిందని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లైంది.