వాటర్ ప్లాంట్ యజమాని జగదీశ్ హత్యకేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. నగరిలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన నిందితులను చూపి.. వివరాలు వెల్లడించారు. నగరి పట్టణ పరిధిలోని నెత్తంకండ్రిగ పంచాయతీ లక్ష్మీపురంలో ఫిబ్రవరి 3వ తేదీన వాటర్ ప్లాంట్ యజమాని జగదీశ్‌ను కత్తులతో నరికి హత్య చేశారన్నారు. ఈ హత్యకు వివాహేతర సంబంధం కారణమని తెలిపారు. గుండ్రాజుకుప్పం డంపింగ్ యార్డు వద్ద ఉన్న నిందితులు సుధాకర్, దాసుకుప్పానికి చెందిన మురళి, తిరువళ్లూరు రామదాసుపురానికి చెందిన మగేష్, తిరుపాచూరుకు చెందిన అజిత్, కడంబత్తూరులోని అధిగత్తూరుకు చెందిన హరిహరన్ కుమార్ అలియాస్ వసంత్, సూట్‌సూరి, రాజముత్తు, జయశంకర్‌బాలాజీను సోమవారం అరెస్టు చేశామన్నారు. వీరిని విచారించి హత్యకు దారితీసిన పరిస్థితులను రాబట్టినట్లు చెప్పారు. సుధాకర్ భార్యతో.. వీరి ఇంటి యజమాని జగదీ్‌షకు వివాహేతర సంబంధం ఏర్పడిందన్నారు. దీంతో ఆమె భార్య విడాకుల కోసం కోర్టుకు వెళ్లడంతో జగదీ్‌షపై సుధాకర్ కక్ష పెంచుకున్నాడన్నారు. అతడిని హత్యచేసేందుకు సత్యవేడు మండలం దాసుకుప్పానికి చెందిన మురళితో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు ఫిబ్రవరి 3వతేదీన జగదీష్ కారు దిగి ఇంటికి వెళ్లే సమయంలో పొదల చాటున ఉన్న వసంత్ అనే వ్యక్తి జగదీ్‌షపై దాడి చేయడంతో మృతి చెందాడని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ.1.37 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, వేటకత్తిని స్వాధీనం చేసుకుని, కోర్టుకు హాజరు పరిచిన సీఐ సుధాకర్‌ను డీఎస్పీ ప్రశంసించారు.