తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న ‘శంఖారావం’ యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా టీడీపీ శ్రేణులు సర్వం సిద్ధం చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి పాలకొండలో లోకేశ్ యాత్ర ప్రారంభం కానుంది. బుధవారం రాత్రి సాలూరులో నిర్వహించనున్న సభతో పర్యటన ముగియనుంది. అయితే జిల్లా ఆవిర్భావం తర్వాత తొలిసారిగా లోకేశ్ ‘మన్యం’కు వస్తుండడంతో పార్టీ కార్యకర్తలు, నేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభల విజయవంతానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. టీడీపీ శ్రేణులతో పాటు ప్రజలు, అభిమానులు పెద్దఎత్తున సభలకు తరలివచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవంగా రాష్ట్రంలో 120 నియోజకవర్గాల్లో లోకేశ్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో శంఖారావం యాత్ర చేపట్టనున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చాక కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జిల్లా ప్రజలకు ఆయన వివరించనున్నారు. అనివార్య కారణాల వల్ల యువగళం పాదయాత్ర ముగింపు సభను భోగాపురం మండలం పోలిపల్లిలో నిర్వహించారు. అప్పటి పరిస్థితుల కారణంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలో లోకేశ్ పర్యటించలేదు. ఈ నేపథ్యంలో పాదయాత్ర చేపట్టని నియోజకవర్గాల్లో తాజాగా శంఖారావం సభలు నిర్వహించనున్నారు. జిల్లాలో రోజూ రెండు నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారు.