ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం యూఏఈకి చేరుకున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు ప్రధాని మోదీ 7 సార్లు యూఏఈలో పర్యటించడం విశేషం. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయేద్.. ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇరువురు దేశాధినేతలు సమావేశమై.. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చించారు. ఆ తర్వాత అహ్లాన్ మోదీ పేరిట అబుదాబిలో ప్రవాస భారతీయులతో నిర్వహించనున్న సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. రేపు వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ప్రపంచ నేతలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం బాప్స్ స్వామినారాయణ్ సంస్థ నిర్మించిన యూఏఈలోనే అతిపెద్ద హిందూ ఆలయాన్ని మోదీ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఖతార్ పయనం కానున్నారు.