అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి తాను సిద్ధమేనని అమెరికా వైస్-ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ స్పష్టం చేసింది. అధ్యక్షుడు జో బైడెన్ జ్ఞాపకశక్తి, వయసుపై విమర్శల వేళ కమలా హ్యారిస్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా మీడియా వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత సంతతికి చెందిన కమలా మాట్లాడుతూ.. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని, అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పారు. తనను గమనించిన ప్రతి ఒక్కరికీ నా సామర్థ్యం గురించి తెలుసని వ్యాఖ్యానించారు. కాగా, అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అనూహ్య పరిస్థితిలో ఆ పదవి నుంచి దిగిపోవాల్సి వస్తే.. ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నవారు ఆ బాధ్యతలను చేపడతారు. ఈ ప్రకారం కమలాకు అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయి.
కానీ, ఆ బాధ్యతలు చేపట్టే విషయంలో ఆమె సామర్థ్యంపై పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. తన సామర్థ్యంపై తలెత్తిన అనుమానాలను కమలా హ్యారిస్ తోసిపుచ్చారు. వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల జో బైడెన్ జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఇటీవల ఒక నివేదిక పేర్కొంది. దానికి రెండు రోజుల ముందు హ్యారిస్ సదరు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. బైడెన్ ప్రస్తుతం 82 ఏళ్లకాగా.. ఆయనకు జ్ఞాపకశక్తి చాలా తక్కువగా ఉందని ఆ నివేదిక పేర్కొంది. తన జీవితంలోని కీలక సంఘటనలను సైతం ఆయన జ్ఞప్తికి తెచ్చుకోలేకపోయారని తెలిపింది.
అంతేకాదు, కుమారుడి మరణం విషయమూ కూడా అధ్యక్షుడికి గుర్తులేదని ఆ నివేదిక పేర్కొంది. బైడెన్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ స్పెషల్ కౌన్సిల్ రాబర్ట్ హుర్ ఈ నివేదికను రూపొందించారు. గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయేల్‌పై హమాస్ దాడి తర్వాత అధ్యక్షుడు ఒత్తిడిలో ఉన్నారని పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో హ్యారిస్ సైతం అధ్యక్షుడికి మద్దతుగా స్పందించారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ వెలువడిన ఈ నివేదిక రాజకీయ ప్రేరేపితమని ఆమె తోసిపుచ్చారు.
కాగా, నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ మళ్లీ గెలిపించే కీలక బాధ్యతను కమలా హ్యారిస్ భుజాలకెత్తుకున్నారు. ఎన్నికల ప్రచారంలో అబార్షన్ సహా సహా పలు అంశాలపై దృష్టి సారించారు. రిపబ్లికన్ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి పోటీకి ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా, హ్యారిస్‌ను లక్ష్యంగా చేసుకుని తరుచూ ప్రతిపక్ష రిపబ్లికన్‌లు విమర్శలు గుప్పిస్తున్నారు. బైడెన్ లాగే రేటింగ్‌లో ఆమె వెనుకబడ్డారని పలు పోల్స్ వెల్లడిస్తున్నాయి.