ఇటీవల జరిగిన పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. మొత్తం 265 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నుంచి పోటీచేసిన స్వతంత్రులు 101 చోట్ల విజయం సాధించారు. తర్వాత నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్ (పీఎంఎల్-ఎన్) 75 చోట్ల, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 54 సీట్లలో గెలుపొందాయి. ఎవరికీ పూర్తిస్థాయి సంఖ్యాబలం లేకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. సైన్యం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ పగ్గాలు చేపట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైంది.
షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్, బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పీపీపీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. అయితే, అధికార పంపకంపై కొన్ని కీలక ప్రతిపాదనలు ముందుకొచ్చినట్టు సమాచారం. తమ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీకి ప్రధాని పదవి కావాలని పీపీపీ గట్టిగా పట్టుబడినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని పదవిని పీఎంఎల్-ఎన్ మూడేళ్లు, పీపీపీ రెండేళ్లు పంచుకోవాలన్న ప్రతిపాదనపైనా కసరత్తు జరుగుతోందని బిలావల్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, ప్రావిన్సుల్లోనూ ఈ రెండు పార్టీల సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటుచేయడానికి చర్చలు జరుగుతున్నాయి.
అక్కడ కూడా ముఖ్యమంత్రి పదవి కూడా ఫిఫ్టీ-ఫిఫ్టీ విధానానికి పట్టుబడుతున్నారు. గతంలో 2013 ఎన్నికలప్పుడు బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో పీఎంఎల్-ఎన్, నేషనల్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేయగా... సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు దక్కింది. ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ 133 కాగా.. పీఎంఎల్-ఎన్ (74), పీపీపీ (54)లు కలిస్తే మొత్తం 129 సీట్లు అవుతాయి. ఆరుగురు స్వతంత్రులు కూడా తమ పార్టీలో చేరినట్లు పీఎంఎల్-ఎన్ ప్రకటించింది. అలాగే, 17 సీట్లు నెగ్గిన ఎంక్యూఎం-పీతోనూ చర్చలు జరుగుతున్నాయని ఆ పార్టీ పేర్కొంది. మరోవైపు, పీఎంఎల్-ఎన్, పీపీపీ ఏర్పరిచే సంకీర్ణ ప్రభుత్వంలో తాము చేరే ప్రసక్తే లేదని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) స్పష్టం చేసింది. వారితో కూటమి కట్టే కంటే.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఇష్టపడతామని పేర్కొంది.
కాగా, సాధారణ మెజార్టీకి చాలా దూరంలో ఆగిపోయినా.. నవాజ్ షరీఫ్‌కు సైన్యం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆయన ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడకుండానే తమకే ఆధిక్యత వచ్చిందని, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఇక, ఈ ఎన్నికలకు ముంద పలు కేసులు బనాయించి ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకే పరిమితం చేశారు. ఆయన ప్రచారం చేయకపోయినా... ప్రజలు మాత్రం పీటీఐ బలపరిచిన స్వతంత్రులను ఆదరించారు.