టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా.. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మాదిరిగా వ్యూహాత్మకంగా వైసీపీని దెబ్బ కొడుతుందా.. వైసీపీలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు చంద్రబాబు వైపు వస్తారా.. ఇటీవలి కాలంలో ఏపీ రాజకీయాల్లో ఎక్కువ చర్చకు వచ్చిన అంశాలివి. కానీ వీటన్నింటికీ టీడీపీ అధినేత చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టేసినట్లు తెలిసింది. రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చేసినట్లు సమాచారం.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం పలువురు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కంభంపాటి రామ్మోహన్, గొట్టిపాటి రవికుమార్‌లతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలోనే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీపై అధినేత క్లారిటీ ఇచ్చేశారని సమాచారం. ఈ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీచేయడం లేదని చంద్రబాబు తెలియజేసినట్లు తెలిసింది. చంద్రబాబు నాయుడు నిర్ణయంతో ఈ రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది. ఇదే సమయంలో మూడు స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి.
టీడీపీ రాజ్యసభ ఎన్నికలకు దూరమైతే.. సైకిల్ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఆ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. 1983లో తొలిసారిగా టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రాజ్యసభలో సైకిల్ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. కానీ 2019 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. ప్రస్తుతం టీడీపీకి రాజ్యసభలో కనకమేడల రవీంద్ర కుమార్ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీకాలం ఏప్రిల్ రెండుతో ముగియనుంది. రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరమైతే.. ఇక ఆ పార్టీకి రాజ్యసభలో ఒక్క ఎంపీ కూడా ఉండరు.
మరోవైపు ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన సమావేశంలోనే రా.. కదలిరా సభలు, శంఖారావం యాత్రపై చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. అలాగే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నేతలంతా ఫుల్ యాక్టివ్‌గా ఉండాలని అధినేత సూచించినట్లు తెలిసింది. అలాగే వైసీపీ నుంచి ముఖ్యనేతలు టీడీపీతో టచ్‌లో ఉన్నారనే విషయాన్ని చంద్రబాబు తెలియజేశారని సమాచారం. అయితే వైసీపీ నుంచి వచ్చిన వారందరినీ తీసుకోలేమని స్పష్టం చేశారట. అలాగే పొత్తులు, ఇతర పార్టీల నేతల ద్వారా ముందునుంచి పార్టీలో ఉన్న టీడీపీ నేతలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చినట్లు తెలిసింది.