టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మతో కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ఉత్తపుత్రుడు, దత్తపుత్రుణ్ని వెంటేసుకుని తిరుగుతున్న చంద్రబాబును కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలని అన్నారు. ఒంటరిగా జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక.. అందరినీ కలుపుకుంటున్నారని కొడాలి నాని సెటైర్లు వేశారు. ఎంతమంది కలిసి వచ్చినా.. జగన్‌ను ఓడించడం అయ్యే పనికాదని అన్నారు. బీజేపీ నుంచి వదిన పురందేశ్వరి, కాంగ్రెస్ నుంచి షర్మిల, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చాలక.. చంద్రబాబు ఢిల్లీకి కూడా వెళ్లారంటూ కొడాలి నాని విమర్శించారు.
ఢిల్లీ పర్యటనలో బీజేపీ, జనసేనకు 150 సీట్లు కావాలని అమిత్ షా చెప్పి ఉంటారన్న కొడాలి నాని.. అందుకే చంద్రబాబు ఏమీ మాట్లాడకుండా హైదరాబాద్‌లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఆఫర్‌కు ఏమీ చేయలేక ముందు నొయ్యి, వెనుక గొయ్యిలో చంద్రబాబు పరిస్థితి తయారైందంటూ సెటైర్లు వేశారు. ఇదే క్రమంలో గోదావరి జిల్లాల పర్యటనలను పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకోవటంపైనా కొడాలి నాని తన స్టైయిల్‌లో పంచులు వేశారు. భీమవరం వెళ్లాలని అనుకుంటే హెలికాప్టరే కావాలా అంటూ ప్రశ్నించారు. హెలికాప్టర్ లేకుండా భీమవరం వెళ్లకూడదా అంటూ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన కోసం కాలేజీలో హెలిపాడ్ పర్మిషన్ అడిగారని.. అయితే ఇళ్ల మధ్యలో ల్యాండింగ్‌కు అధికారులు ఒప్పుకోలేదంటూ కొడాలి నాని చెప్పుకొచ్చారు. అయితే భీమవరం పర్యటనను పవన్ వాయిదా వేసుకోవటానికి వేరే కారణం ఉందని కొడాలి అన్నారు. జనంలోకి వెళ్తే ఎన్నిసీట్లలో జనసేన పోటీచేస్తోందని అడుగుతారనే భయంతోనే పవన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నాడంటూ ఎద్దేవా చేశారు. మొత్తంగా ఏపీ ఎన్నికలకు మరో ఒకటిన్నర నెలమాత్రమే ఉన్న సమయంలో.. లీడర్ల మధ్య మాటల మంటలు, పంచుల ఫైటింగ్‌లు షురూ అయ్యాయి. రాబోయే రోజుల్లో ఇది ఏ స్థాయి వెళ్తాయో చూడాలి మరి.