తెలుగు రాష్ట్రాల్లోని యువతకు, ఇంజినీరింగ్ విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్, తిరుపతిలలో నేషనల్ అన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగురాష్ట్రాలలో నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అనేక ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. అయితే నైపుణ్యంతో కూడిన అత్యుత్తమ శిక్షణ అందించే కేంద్రాలు చాలా తక్కువనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఈ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించింది.
మరోవైపు తిరుపతి, సికింద్రాబాద్ నగరాల్లో త్వరలోనే నేషనల్ అన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా కార్యకలాపాలు మొదలవుతాయి. ఒక్కో సెంటర్ ద్వారా మూడేళ్లలో కనీసం ఐదువేల మందికి శిక్షణ ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కేంద్రాల ద్వారా తెలుగు రాష్ట్రాలలోని ఇంజినీరింగ్ విద్యార్థులు, యువత, నిరుద్యోగులకు నైపుణ్యంతో కూడిన శిక్షణ లభిస్తుంది. అలాగే శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు నేషనల్ అన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్లు.. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో ఉంటాయి. ఈ సెంటర్ల ద్వారా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సహా ఇతర అనుబంధ రంగాల్లో మెరుగైన శిక్షణ విద్యార్థులకు అందుతుంది. అలాగే కంపెనీలకు అవసరమైన శిక్షణ ముందే పూర్తిచేసుకోవటంతో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.