ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు రెండుచోట్లా ఓటుహక్కు ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన భార్య లక్ష్మి, కుమారుడు భార్గవ్‌రెడ్డి, కోడలు నవ్యకు మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం సజ్జల కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న రెయిన్‌ట్రీ పార్కు విల్లాలో నివసిస్తోంది. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కాజ గ్రామంలో పోలింగ్ బూత్ 132లో వరుస సంఖ్య 1089, 1090, 1091, 1105లో నవ్య, సజ్జల లక్ష్మి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి ఓట్లు ఉన్నాయి.
ఇటు పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని నంబూరు పోలింగ్ బూత్ 31లో వరుస సంఖ్య 799, 800, 801, 802లో సజ్జల లక్ష్మి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి, నవ్యకు ఓట్లు ఉన్నాయి. ఈ అంశంపై పెదకాకాని తహసీల్దార్ రత్నం స్పందించారు. జరిగిన పొరపాటును గుర్తించి నంబూరులో నలుగురి ఓట్లు తొలగించడానికి వెంటనే ఫాం-7 పెట్టామని.. రాబోయే ఓటర్ల జాబితాలో ఈ ఓట్లు ఉండవన్నారు. డబుల్ ఎంట్రీలు, డెమోగ్రాఫిక్, ఫొటోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను ఇట్టే కనిపెట్టే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామని.. దానిని అమలు చేయడం ద్వారా ఎన్నో డబుల్, ట్రిపుల్ ఎంట్రీలను తొలగించామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
సజ్జల కుటుంబం రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ స్పందించారు. ‘క్యాంపు ఆఫీసు క్లర్కు... రెడ్‌హ్యాండెడ్‌గా బుక్’ అంటూ ట్వీట్ చేశారు. ‘రెండు చోట్ల దొంగ ఓట్లతో సలహాల రెడ్డి అడ్డంగా దొరికాడు. పొన్నూరులో ఒక ఓటు.. మంగళగిరలో మరో ఓటు’ అంటూ కేంద్ర ఎన్నికల సంఘం, సీఈవో ఆంధ్ర, గుంటూరు కలెక్టర్‌కు ట్యాగ్ చేశారు. ఫేక్ ఓటర్స్, డూప్లికేట్ ఓటర్స్, వైసీపీ క్రిమినల్ పాలిటిక్స్, ఏపీ హేట్స్ జగన్ అంటూ హ్యాష్‌ట్యాగ్ చేశారు.