ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఏకంగా దేశంలోనే ఏపీ టాప్‌లో నిలిచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా రిపోర్ట్ ప్రకారం.. 2020 నుంచి 2023 మధ్య (మూడేళ్లలో) ఏకంగా 18 లక్షలమంది కొత్తగా టాక్స్ ఫైల్ చేసినట్లు తేలింది. మహారాష్ట్ర 13.9 లక్షలమంది, ఉత్తరప్రదేశ్ 12.7 లక్షలమంది, గుజరాత్ 8.8 లక్షల మందితో రెండు, మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. ఏపీ పొరుగు రాష్ట్రమైన తెలంగాణ మాత్రం కొన్ని ప్రతికూలతల వల్ల 20వ స్థానంలో నిలిచింది.
దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళలలో యావరేజ్‌న మూడు నుంచి నాలుగు లక్షల కొత్త ఐటీఆర్‌లు ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం ఊహించని విధంగా 18లక్షలమంది ఉన్నారు. రాష్ట్రంలో MSME (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) రంగంలో ఏర్పాటైన కంపెనీలు, పెట్టుబడులు కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. ITR ఫైలింగ్‌లో మొత్తం పెరుగుదలలో 60%కి దోహదపడుతున్న మొదటి ఐదు రాష్ట్రాలు.. కేంద్రం తీసుకొచ్చిన ఉద్యం రిజిస్ట్రేషన్‌లలో 45% శాతం ఉన్నాయంటున్నారు.
ఈ మూడేళ్లలో చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో 6.6లక్షల ఉద్యం రిజిస్ట్రేషన్లు.. 4.1 లక్షల జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. అయితే ITR ఫైలింగ్ పాన్ కార్డ్ అడ్రస్‌పై ఆధారపడి ఉంటుందని గమనించడం చాలా ముఖ్యం. ఇది ఆ వ్యక్తి ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థకు సంబంధించిన సరైన వివరాలు కాకపోవచ్చు. మొత్తం మీద ఏపీ కొత్తగా టాక్స్ ఫైల్ (ITR Filing) చేసే వారి సంఖ్యలో టాప్‌లో నిలిచింది.