ఏపీలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించి మరో క్లారిటీ వచ్చింది. ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణం తెచ్చుకునే అవకాశం లబ్ధిదారులకు కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. డేటా బేస్‌లోనూ వివరాలన్నీ పదిలంగా ఉంటాయని.. రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్టిఫైడ్ కాపీ పొందే వీలుంటుంది అన్నారు. ఫోర్జరీకి, ట్యాంపర్ చేస్తారని భయం ఉండదు అన్నారు. విక్రయించే సమయంలో ఈ డాక్యుమెంట్ ఒకటి ఉంటే సరిపోతుంది అంటున్నారు. ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పట్టాల రిజస్ట్రేషన్ల పేరిట మోసం చేస్తున్నారనడం సరికాదని.. లబ్దిదారులు వారి ప్లాట్ ఎక్కడ ఉందో గుర్తించలేని స్థితిలో ఉన్నాయి అన్నది పూర్తిగా అవాస్తవం అని తెలిపారు.
నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇంటి స్థలంతో పాటు, ఇల్లు కూడా కట్టించి ఇస్తామని హామీ ఇచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇచ్చిన మాట కంటే మిన్నగా 31 లక్షల 19 వేల మంది నిరుపేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చి అందులో 22 లక్షల ఇళ్లు మంజూరు చేసింది అన్నారు. ఇళ్ల నిర్మాణం కూడా వేగంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. ప్రస్తుతం చేస్తున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ వల్ల లబ్ధిదారులకు ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి రుణం తెచ్చుకునే సౌలభ్యం లబ్ధిదారుకు వస్తుందన్నారు. ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేస్తుంది కాబట్టి బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయన్నారు. డాక్యుమెంట్ రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి డేటాబేస్‌లో ఈ వివరాలన్నీ పదిలంగా భద్రపరచబడి ఉంటాయన్నారు. ఎప్పుడంటే అప్పుడు సర్టిఫైడ్ కాపీ పొందే వీలుంటుందని.. ఫోర్జరీ చేస్తారనిగానీ, ట్యాంపర్ చేస్తారనిగానీ భయం లేదన్నారు. అమ్మే సమయంలో ఈ డాక్యుమెంట్ ఒకటే ఉంటే సరిపోతుందన్నారు. ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదని.. నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడే ప్లాట్లు విభజన చేసి, సరిహద్దు రాళ్లు వేశారని.. అలాగే లబ్ధిదారులను వారి వారి ప్లాట్‌లలో ఫొటోలు తీసుకుని జియో ట్యాగ్ చేసిన విషయాన్ని గుర్తుచేస్తోంది ప్రభుత్వం. ప్లాట్‌లో నిలబడి ఫొటో దిగారంటే లబ్ధిదారులకు వారి ప్లాట్ ఎక్కడ ఉందో తెలుసునని అర్థమవుతోందన్న విషయాన్ని గమనించాలన్ారు.
మరోవైపు ప్రభుత్వం ఈ ఇళ్లను సొంతంగా నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఆర్థికంగా కూడా వెసులుబాటు కల్పిస్తోంది. పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇళ్ల లబ్ధిదారుల్లో పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తోంది.. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తుండగా.. అదనంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణాలు అందేలా చూస్తోంది. అయితే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.