ప్రస్తుతం ఎక్కడ చూసినా వాలెంటైన్స్ డే హంగామా నడుస్తోంది. ప్రేయసి కోసం అబ్బాయిలు, ప్రియుడిని వెతుక్కుంటూ అమ్మాయిలు.. వారికి ప్రపోజ్ చేసి తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే ప్రపోజ్ రిజెక్ట్ అయిన వారిలో చాలా మంది వైన్స్‌కు వెళ్లి మందు బాటిల్ తెచ్చుకుని తాగుతారు. కొందరు తమ ప్రేమ విఫలం అయిందనే బాధలో తాగితే.. మరికొందరు మాత్రం తన లవ్ సక్సెస్ అయిందన్న ఆనందంలో మందు పార్టీ చేసుకుంటారు. అంటే ఎటు చూసినా చుక్క పడాల్సిందే అన్న మాట. అయితే ఇలాంటి వాలెంటైన్స్ డే వేళ.. అధికారులు మందుబాబులకు షాక్ ఇచ్చారు. బుధవారం నుంచి 4 రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మందు బాబులు అవాక్కయ్యారు.
అయితే ఈ మద్యం విక్రయాలు బంద్ చేసింది మాత్రం మన దగ్గర కాదు. ఈ విషయం చెప్పగానే చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో అధికారులు 4 రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు నగరంలో లిక్కర్ అమ్మకాలపై నిషేధం ఉంటుందని ప్రకటించారు. అయితే వాలెంటైన్స్ డేకు మద్యం అమ్మకాలపై నిషేధానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కర్ణాటక శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఒక స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో అక్కడ మద్యం విక్రయాలపై నిషేధం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ ఉపఎన్నిక పోలింగ్ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఈ నెల 20 వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో 4 రోజులపాటు మద్యం అమ్మకాలను నిషేధించాలని అధికారులు నిర్ణయించారు. అయితే బెంగళూరులోని పోలీసు కమిషనర్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు మినహా నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఈ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 17 వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం అమల్లో ఉంటుందని చెప్పారు.
ఇక బెంగళూరు లాంటి మెట్రో సిటీలో 4 రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తుండటంతో పబ్‌లు, బార్లు, వైన్స్‌లు భారీగా నష్టాలు చవిచూస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నిర్ణయంతో సుమారు రూ .500 కోట్లు నష్టపోవచ్చని వారు అంచనా వేశారు. వాలంటైన్స్ డే వేళ భారీగా మద్యం అమ్మకాలు సాగుతాయని మద్యం దుకాణదారులు భావించగా.. ఈ నిర్ణయం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఈ క్రమంలోనే 4 రోజుల పాటు మద్యం విక్రయాలపై నిషేధం విధించడంపై పునరాలోచించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బెంగళూరు సిటీ డిస్ట్రిక్ట్ లిక్కర్ ట్రేడర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ఈ నిషేధం వల్ల సుమారు 3700 సంస్థలపై ప్రభావం పడుతుందని.. రాష్ట్రానికి రూ.300 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని అసోసియేషన్ తెలిపింది.