రానున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ప్రస్తుతం ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. 2014 ఎన్నికల్లో దరఖాస్తులను ఆహ్వానించినా ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. దాంతో అప్పటికే నియోజకవర్గాల్లో ఉన్న నాయకులకు అధిష్ఠానం సీట్లు ఇచ్చి పోటీ చేయించింది. కానీ, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగేందుకు పోటీ నెలకొంది. ఒక్కో నియోజకవర్గం నుంచి పదుల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్నవారంతా క్రియాశీలకంగా మారారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖ పార్లమెంటు స్థానంతోపాటు దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాల అభ్యర్థిత్వం కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. పార్లమెంటు స్థానానికి ఇప్పటి వరకు 12 మంది దరఖాస్తు చేశారు. వీరిలో గంపా గోవింద్, వజ్జపర్తి శ్రీనివాస్, మహిళా విభాగం నాయకులు లక్ష్మి, గుత్తుల శ్రీనివాస్, తదితరులు ఉన్నారు. ఇక తూర్పు నియోజకవర్గం టికెట్ కోసం ఎనిమిది మంది, ‘పశ్చిమ’ సీటు కోసం పది మంది, ‘ఉత్తరం’ కోసం పది మంది, ‘గాజువాక’కు పది మంది, ‘భీమిలి’కి 12 మంది, దక్షిణ నియోజకవర్గం నుంచి ఎనిమిది, ఎస్.కోట నుంచి పది మంది దరఖాస్తు చేసుకున్నారు. విశాఖ పార్లమెంటు, దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు మొత్తం 80 దరఖాస్తులు అందాయి. ఈ నెల 29 వరకు గడువు ఉండడంతో ఈ సంఖ్య వంద దాటుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.