మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులును ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సుధ దంపతులు, బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ సతీమణి అక్షత సునాక్ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ధార్మిక పర్యటనలో ఉన్న శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు అక్కడి జయనగర్‌లో 5వ బ్లాక్‌లోని రాఘవేంద్రస్వామి మఠంలో వారు కలిశారు. మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి మఠంలో చేస్తున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు.
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కుటుంబాలకు ఆధ్యాత్మికత ఎక్కువ. గతంలో రిషి సునాక్ తల్లిదండ్రులు యస్వీర్ సునాక్, ఉషా సునాక్‌లు కూడా మంత్రాలయం వెళ్లారు. అక్కడ మంచాలమ్మను, రాఘవేంద్రస్వామి మూలబృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థులు యస్వీర్ సునాక్, ఉషా సునాక్ దంపతులకు రాఘవేంద్రస్వామి చిత్రపటం, ఫల పుష్ప, శేషవస్త్రాలు, వెండి గిన్నె, ఫలమంత్రాక్షితలు పరిమళ ప్రసాదం అందజేశారు.. ఆశీర్వచనాలు అందించారు. అలాగే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కోసం కూడా స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
నారాయణమూర్తి కుటుంబం గతేడాది తిరుమల శ్రీవారికి బంగారు ఆభరణాలు కానుకగా అందజేసిన సంగతి తెలిసిందే. స్వామివారిని దర్శించుకుని బంగారు శంఖం, బంగారు తాబేలును శ్రీవారికి కానుకగా అందజేశారు. 2 కిలోల బంగారంతో వీటిని ప్రత్యేకంగా తయారు చేయించారు. తిరుమల శ్రీవారిని తాము ఇష్ట దైవంగా భావిస్తామని సుధామూర్తి చెప్పారు. ప్రతి ఏటా తిరుమలకు వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటామన్నారు. 70 ఏళ్లుగా తిరుమల కొండకు వస్తున్నానని.. ఇక్కడకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని నారాయణమూర్తి అన్నారు.