కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టులో ఊరట దక్కింది. ఇటీవల అరెస్టుకు జారీ చేసిన వారెంటును కోర్టు రీకాల్ చేసింది. గత ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల వాయిదాలకు వంశీ హాజరుకాకపోతుండడంతో గత నెలలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గాయత్రీదేవి అరెస్టు వారెంటు జారీ చేశారు. వంశీ గురువారం విజయవాడలోని కోర్టుకు హాజరయ్యారు.. ఆయన న్యాయస్థానంలో రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి ఆమోదించారు. అనంతరం వంశీ, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ తదితర నిందితులను జడ్జి విచారించారు. సాక్షుల విచారణ కోసం వచ్చే నెల 4వ తేదీ నుంచి షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఈ నెల 2న విజయవాడ ప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో.. మొత్తం 38 మందిపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. కేసు విచారణకు కోర్టుకు హాజరుకాకపోవటంతో బెయిలబుల్ వారెంట్‌ను గత విచారణలోనే న్యాయస్థానం జారీ చేసింది. అయినా సరే విచారణకూ హాజరుకాకపోవటంతో వారెంట్ అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. అయితే ఆయన తాజాగా కోర్టుకు వెళ్లడం.. రీకాల్ పిటిషన్ వేయడంతో ఊరట దక్కింది.