శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదిత్యుడి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. సూర్యుని పుట్టిన రోజైన ఈ రథసప్తమి నాడు అరసవల్లి సుర్యదేవునికి విశేష పూజలు జరిగాయి. ముందుగా విశాఖ శ్రీ శారదా పీఠాదిపతి శ్రీ స్వరూపానంద సరస్వతి శిష్య పరంపర స్వాత్మనందేంద్ర సరస్వతి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవానికి అంకురార్పణ చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి సూర్యజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
సరిగ్గా 12 గంటల 5 నిమిషాల నుంచి క్షీరాభిషేకం ప్రారంభమైంది. పాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలుతో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. ఉదయం ఐదు గంటల నుంచి భక్తులకు స్వామి వారి నిజరూప దర్శనం ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ నిజరూప దర్శనం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. రథసప్తమి, సూర్యజయంతి సందర్భంగా స్వామి వారికి విశేష పుష్పమాల అలంకరణ సేవ, విశేష అర్చన, నీరాజనం వంటి పూజలను నిర్వహిస్తున్నారు.
స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. లక్షలాది మంది భక్తులు అరసవల్లి సూర్యభగవానుడి నిజరూప దర్శనం చూసి పులకించిపోయారు.. ఏడాది ఒక్కసారి మాత్రమే సూర్య జయంతి నాడు ఈ మహా దర్శనం లభించనుండటంతో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు, ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అరసవెల్లి మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
సాధారణ భక్తులు.. వీఐపీలతో అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయం కిటకిటలాడుతోంది. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు రావు,ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వామి వారిని దర్శించుకున్నారు. రథసప్తమి సందర్భంగా సర్వాంగ సుందరంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు . ఆదిత్యుని నామస్మరణతో అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది.