ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. అయితే ఈసారి వ్యాఖ్యల ద్వారా కాకుండా చేష్టల ద్వారా వార్తల్లో నిలిచారు. సీఎం జగన్ సీటులో గుడివాడ అమర్‌నాథ్ కూర్చున్నారంటూ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరిశ్రమల శాఖకు సంబంధించిన సమీక్షా సమావేశంలో గుడివాడ అమర్‌నాథ్ సీఎం సీటులో కూర్చున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఎక్స్ వేదికగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీద విమర్శలు చేశారు. పాపం అమర్‌నాథ్ పోటీకి సీటు ఇవ్వలేదని సెక్రటేరియట్ వెళ్లి ఏకంగా సీఎం సీట్లో కూర్చున్నారంటూ ట్వీట్ చేశారు. "సీఎం కుర్చీ అంటే కేవలం చైర్ కాదు...అదోక హోదా! వీళ్లకు అర్థం కాదు.. వీళ్ల పోకడులకు అర్థం లేదు" అంటూ దీనికి సంబంధించిన వీడియోను ధూళిపాళ్ల నరేంద్ర ట్వీట్‌కు జతచేశారు. ఈ నేపథ్యంలో ధూళిపాళ్ల నరేంద్ర ట్వీట్ మీద అమర్‌నాథ్ స్పందించారు. నరేంద్ర ట్వీట్‌కు స్ఠ్రాంగ్ కౌంటర్ ఇస్తూనే చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేశారు.
తానేమీ చంద్రబాబు లాగా కుర్చీ లాక్కునే రకం కాదన్న గుడివాడ అమర్‌నాథ్.. చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్టు లాక్కున్నారని ఆరోపించారు. తాను కేవలం సీఎం జగన్ సమీక్షలు నిర్వహించే రూమ్‌లో మాత్రమే కూర్చున్నానని.. జగన్ మోహన్ రెడ్డి కుర్చీలో తాను కూర్చోలేదని వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో అసెంబ్లీలో బాలకృష్ణ.. ఏకంగా చంద్రబాబు కుర్చీలో కూర్చున్నారన్న అమర్నాథ్.. నరేంద్రకు దమ్ముంటే బాలకృష్ణను ప్రశ్నించాలని అన్నారు. సీఎం జగన్‌కు తామంతా సైనికులమన్న అమర్నాథ్ .. జగన్ అనుకుంటే ఎవరినైనా, ఎక్కడైనా కూర్చోబెడతారని అన్నారు.
ఇటీవల రిలయన్స్ బయో ఎనర్జీ. ఆదిత్యా బిర్లా గ్రూప్ సహా పలు సంస్థలకు చెందిన పరిశ్రమలకు గుడివాడ అమర్‌నాథ్ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సమయంలోనే ఆయన సీఎం కుర్చీలో కూర్చున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏం జరిగిందనే దానిపై అమర్నాథ్ క్లారిటీ ఇచ్చారు.