టీడీపీ అధినేత చంద్రబాబు కుర్చీని మడతపెట్టి అంటూ సినిమా రేంజ్‌లో డైలాగ్ చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అరాచకాలపై తిరగబడాల్సిన సమయం ఇది.. ఇంకా 53 రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. అమరావతిలో సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ రాసిన ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ సభకు టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం చొక్కా మడత బెడితే.. టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు కుర్చీలు మడతపెడతారంటూ చంద్రబాబు కౌంటరిచ్చారు. అప్పుడు జగన్‌కు కుర్చీనే ఉండదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే జనం ఊరుకోరు అంటూ ఘాటుగా స్పందించారు.
ఈ ఐదేళ్ల నరకం నుంచి విముక్తి పొందడానికి తిరగబడతారో, బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తేల్చుకోవాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ను ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాతో కలిసి నడవాలన్నారు. తనకు పవన్ కళ్యాణ్‌కు తెలుగుజాతి ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఉండాలనే సంకల్పం ఉందన్నారు. ఒక పాలకుడు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేశారో విధ్వంసం పుస్తకంలో చాలా స్పష్టంగా రాశారన్నారు. రేపో మాపో పుస్తక రచయిత ఆలపాటి సురేష్‌కు కూడా వేధింపులు ఎదురవుతాయన్నారు. తన మనస్సులో, ప్రజల మనస్సులో ఏముందో స్పష్టంగా ఈ పుస్తకంలోనూ అదే రాశారన్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్, యువత భవిష్యత్ దెబ్బతినింది అన్నారు.
ఈ పుస్తకాన్ని అమరావతి మహిళలకు అంకితం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. అమరావతి రైతులు త్యాగం చేశారని, అమరావతి రైతులను పెట్టిన బాధ భవిష్యత్తులో శత్రువులకు కూడా రాకూడదన్నారు. అమరావతి ప్రజా రాజధాని కావాలని సర్వమత ప్రార్థనలు చేసి ఇక్కడ సంకల్పం చేశామని చంద్రబాబు అన్నారు. అమరావతి నిర్మించి ఉంటే 2 లక్షల కోట్ల ఆస్తి సృష్టించబడేదని, ఇది ప్రజలు ఆస్తి అన్నారు. ఐదేళ్లుగా మూడు రాజధానుల జపం చేసిన ఈ ప్రభుత్వం .. ఇప్పుడు నాలుగవ రాజధాని పేరు ప్రస్తావిస్తోందన్నారు. రాష్ట్రంలో ఈ ఐదేళ్లు విధ్వంసం కాదు.. అరాచకం జరిగిందన్నారు.
ప్రజా వేదిక కూల్చి ఆ శకలాలను చూసి తాను ప్రతిరోజూ బాధపడాలి అని చేసిన వ్యక్తిని ఏమనాలన్నారు. తాను ప్రజా వేదిక కావాలని అడిగితే దానిని కూల్చి వేశారని.. తాను ఉండే ఇల్లు కూల్చాలని ఐదేళ్లు చూశారన్నారు. ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభకు పొలం ఇచ్చారనే కారణంతో అక్కడి రైతుల ఇల్లు కూర్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ తప్పూ చేయని డాక్టర్ సుధాకర్‌ను వెంటాడి వేధించారన్నారు. శంకర్ విలాస్ రంగనాయకమ్మ వ్యాపారం వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయారు అంటే ఎంతో బాధగా ఉందన్నారు. అమరనాథ్ గౌడ్‌ను పెట్రోల్ పోసి దగ్ధం చేశారని.. రాష్ట్రంలో ఎవరికైనా రక్షణ ఉందా? అని ప్రశ్నించారు. చివరకు సీఎం జగన్ సొంత సోదరి, తల్లిని కూడా సోషల్ మీడియాలో వదల్లేదన్నారు.