ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల ఎన్నో శతాబ్దాల కల నెరవేరి.. గత నెల 22 వ తేదీన ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్య రామ మందిరంలో 5 ఏళ్ల వయసు ఉన్న బాలరాముడిని ప్రతిష్ఠించారు. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాతి రోజు అంటే 23 వ తేదీ నుంచి సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించారు. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్షణం రావడంతో దేశ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు అయోధ్యకు క్యూ కడుతున్నారు. ఫలితంగా అయోధ్య ఆలయంతోపాటు నగరం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలోనే వీలైనంత మంది ఎక్కువ భక్తులకు రోజూ అయోధ్య బాలక్ రామ్ దర్శనాలకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అవకాశం కల్పించింది. అనుకున్నదానికంటే ఎక్కువమంది భక్తులు అయోధ్యకు పోటెత్తడంతో మొదట్లో నిర్ణయించిన దర్శన వేళలను ఆ తర్వాత పొడగించారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి బాలక్ రామ్ దర్శన వేళలను ఆలయ అధికారులు సవరించారు. ఈ శుక్రవారం(ఫిబ్రవరి 16వ తేదీ) నుంచి అయోధ్యలో రామాలయాన్ని ప్రతి రోజు మధ్యాహ్నం ఒక గంట పాటు మూసివేయనున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు భక్తులకు రామ్‌లల్లా దర్శనం ఉండదని ఆలయ పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు.
అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేయలేదని వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం అవుతున్న అయోధ్య రాముడి దర్శనాలు రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. అయితే తెల్లవారుజామున 4 గంటలకే బాలరాముడికి పూజలు నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు.. రెండు గంటలు విరామం తీసుకుని ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు.
అయితే అయోధ్య గర్భగుడిలో కొలువైన రామ్‌లల్లా 5 ఏళ్ల బాలుడు అని.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని గంటల పాటు విరామం లేకుండా భక్తులకు దర్శనం ఇవ్వడం సరైంది కాదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించినట్లు ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయోధ్య ఆలయాన్ని కట్టకముందు పక్కన టెంటులో రామ్ లల్లా ఉన్న సమయంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దర్శనం ఉండేది. అందులో కూడా మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3.30 గంటల వరకు దర్శనాలకు బ్రేక్ ఇచ్చేవారు.