ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు ఒక చీర కొనితెచ్చారు.. ఎంత ఘోరంగా ఉందంటే: నారా భువనేశ్వరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 17, 2024, 08:53 PM

ఏ పండక్కో, శుభకార్యానికో మొగుడు ఓ చీర కొనిస్తే.. భార్య చాలా సంతోషపడుతుంది. గాజులు కొనిచ్చినా మురిసిపోతుంది. నిత్యం ప్రజల మధ్య బిజీగా ఉండే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తన సతీమణికి అలాంటి ఆనందాన్ని ఇచ్చారా..? అడక్క, అడక్క అడిగితే.. ఒక్కసారి చీర కొని తెచ్చారట. అది ఎంత ఘోరంగా ఉందో చెప్పారు నారా భువనేశ్వరి. ఆ చీరను చూడగానే తనకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైందని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ‘చేనేత మహిళలతో ముఖాముఖి’ కార్యక్రమంలో పాల్గొన్నారు భువనేశ్వరి. చేనేత కార్మికులను ఆప్యాయంగా పలకరించి, మగ్గంపై వాళ్లు చీరలు నేస్తున్న విధానాన్ని పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు భువనేశ్వరి.


తన భర్త చంద్రబాబు నాయుడిని ఒక్కసారి ఎప్పుడో చీర ఎందుకు తీసుకురారని అడిగానని భువనేశ్వరి తెలిపారు. ‘మిగతా మొగుళ్లు చీర తెస్తారు. మీరు ఒక్క చీర కూడా తీసుకురారు అని ఆయణ్ని అడిగాను. అది గుర్తుంచుకొని ఒకసారి చీర తెచ్చారు. ఇది జరిగి ఎన్ని సంవత్సరాలయ్యిందో నాకైతే గుర్తు లేదు గానీ, ఆ చీర చూడగానే నాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. అంత ఘోరంగా ఉంది. ఎందుకంటే ఆ కలర్లు, అయన్నీ చూసి. ఇది జరిగి 30 ఏళ్లు అయుంటుంది’ అని భువనేశ్వరి చెప్పారు.


మరి ఆ చీరను ఏం చేశారు?


ఏదేమైనా తన భర్త తనకు చీర కొని తెచ్చారని సంతోషించానని నారా భువనేశ్వరి తెలిపారు. ‘నా మొగుడు నాకొక చీర తెచ్చాడని, బీరువాలో పెట్టి జాగ్రత్తగా దాచుకున్నాను. ఆయన ప్రేమతో తెచ్చారు గనుక’ అని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. ఆమె ఈ మాటలు చెప్తుండగా సభలో నవ్వులు విరబూశాయి. వేదికపై భువనేశ్వరితో పాటు ఉన్న మాజీ మంత్రి పరిటాల సునీత, ఇతర టీడీపీ మహిళా నేతలు సైతం పెద్దగా నవ్వుకున్నారు.


‘ఆయన (చంద్రబాబు) ప్రజల మనిషి. ఆయనకు భార్య, ఇవన్నీ సెకండ్. ఫస్టు మీ గురించే ఆయన ఆలోచిస్తారు’ అని భువనేశ్వరి చెప్పారు. తాను చేనేత వస్త్రాలను తప్పకుండా ప్రమోట్ చేస్తానని తెలిపారు. ‘ధర్మవరం, పోచంపల్లి, ఇక్కత్.. మీ చేతితో చేసిన ప్రతిదీ నేను ప్రమోట్ చేస్తాను. మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కారు. అది మీ కష్టార్జితం. చాలా గొప్పదనం. నాకు తెలిసి, ఏ చేనేత కార్మికులూ ఇలాంటి ఘనత సాధించలేదు. చేనేత పరిశ్రమ భవిష్యత్తులో మరింత అభివృద్ది చెందాలని కోరుకుంటున్నాను’ అని భువనేశ్వరి అన్నారు.


అటు.. నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి సైతం మంగళగిరిలో చేనేత కార్మికులను కలిశారు. ఆత్మకూరులో చేనేత పరిశ్రమ, డైయింగ్ షెడ్‌ను ఆమె పరిశీలించారు. అనంతరం కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ నెలకొల్పిన స్త్రీశక్తి కేంద్రాన్ని బ్రాహ్మణి సందర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com