విజయవాడ ఎంపీ కేశినేని నానిపైటీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీని నాని నాశనం చేశారని.. ఆయన ఊసరవెల్లి అంటూ మండిపడ్డారు. టీడీపీలో ఉంటూ వైఎస్సార్‌సీపీ కోసం కేశినేని నాని పని చేశారని ఆరోపించారు. ఢిల్లీలో లోకేష్ ఏయే లాయర్లను కలిశారు.. ఎవరెవరితో మాట్లాడుతున్నారనే విషయాన్ని వైఎస్సార్‌సీపీకి చేరవేశారన్నారు. కోర్టు హాల్‌లో బెయిల్ రాకుండా వచ్చిందని ప్రచారం చేశారని.. ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తుంటే లోకేష్ ఎవరిని కలుస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారో వైఎస్సార్‌సీపీకి సమాచారం ఇచ్చారన్నారు.
చంద్రబాబు కోసం పూజలు చేసిన కేశినేని నాని.. ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ వెస్ట్‌లో టిక్కెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి దగ్గర నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారన్నారు. తామిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని నానిపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. తన ప్రాణ స్నేహితుడిని కూడా నమ్మించి మోసం చేశారన్నారు. కేశినేని నాని కాల్ రికార్డ్స్ ఉన్నాయని.. నాని వసూలు రాజా అంటూ ఎద్దేవా చేశారు. తనను పిట్టల దొర అంటున్న కేశినేని నాని విషయాన్ని త్వరలో ప్రజలే తేలుస్తారన్నారు. జగన్ దగ్గర.. వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ల దగ్గర కేశినేని నాని పాలేరు పని చేస్తున్నారన్నారు.
కేశినేని నానిది సైకో మనస్తత్వమని.. విజయవాడ ఎంపీ టిక్కెట్ కేశినేని నానికి ఇవ్వడం జగన్‌కు ఇష్టం లేదన్నారు. అవినాష్, వెలంపల్లి వంటి వారికి కేశినేని నాని అసిస్టెంట్ పని చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని 2019 ఎన్నికల తర్వాత ఎన్ని గ్రామాలకు తిరాగారో చెప్పగలరా అని ప్రశ్నించారు. మొన్నటి వరకు ఏసీ రూముల్లో కూర్చుని ఇప్పుడు బిల్డప్ ఇస్తున్నారని.. అందుకే టీడీపీ అధిష్టానం ఛీత్కరించిందన్నారు. 'మీ నాయకుడి తండ్రి మా పార్టీని ఏం చేయలేకపోయారు' అని.. ఇదే నానికి లాస్ట్ ఎలక్షన్స్ అన్నారు. కేశినేని నాని ఎవరి దగ్గర టికెట్స్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నారో వాళ్లు కూడా త్వరలో మీడియా ముందుకు వస్తారన్నారు. ఎవరెవరి దగ్గర డబ్బులు వసూళ్లు చేశారో అవన్నీ తిరిగి ఇవ్వాలని.. లేదా అన్నీ బయట పెడతామన్నారు. పచ్చగా ఉన్న చెట్టును కూడా చూసి తట్టుకోలేని వ్యక్తి కేశినేని నాని.. రెండున్నర నెలల్లో ప్రజలు జగన్ అండ్ సైకో బ్యాచ్‌కి తగిన బుద్ధి చెబుతారన్నారు.