ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఐడీ శుక్రవారం (ఫిబ్రవరి 16) చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఈ చార్జ్‌షీట్‌లో ఏ1గా చంద్రబాబు నాయుడు, ఏ2గా వేమూరి హరికృష్ణ, ఏ3గా కోగంటి సాంబశివరావును పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగినట్లు గుర్తించామని సీఐడీ గతంలోనే పేర్కొంది. మొత్తం రూ. 2000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ. 333 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇందులో కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది.
ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో భాగంగా టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు, లోకేష్‌కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన ‘టెరా సాఫ్ట్’ కంపెనీకి అక్రమంగా టెండర్లు కట్టబెట్టారనేది ప్రధాన అభియోగం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఇప్పటికే పలు అభియోగాలపై కేసులు నమోదయ్యాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు చేసి, రాజమండ్రి జైలులో 52 రోజుల పాటు ఉంచారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ అరెస్టు వ్యవహారం సంచలనంగా మారాగా.. తాజాగా మరో కేసులో చంద్రబాబు నాయుడిని ఏ1గా పేర్కొంటూ చార్జ్‌షీట్ దాఖలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.