ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే.. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు జోరుగా సాగుతున్నాయి. కాగా.. ఇప్పుడు సినిమా డైలాగులతో ప్రాసలు, పంచులతో కౌంటర్లు వదులుకుంటున్నారు నేతలు. అయితే.. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ చేసిన "చొక్కా మడత పెట్టాల్సిన సమయం వచ్చేసింది" అన్న డైలాగుతో.. ప్రతిపక్ష నాయకులు కుర్చీలు మడతపెడుతూ కౌంటర్లు ఇస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ కామెంట్ చేసిన కాసేపటికే.. విధ్వంసం అనే పుస్తకావిష్కరణలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. కౌంటర్ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడతపెడితే.. టీడీపీ, జనసేన కార్యకర్తలతో పాటు ప్రజలు కుర్చీలు మడతపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ డైలాగ్ విసిరారు బాబు.
అయితే.. చంద్రబాబు కేవలం డైలాగ్ వేసి వదిలి పెడితే.. ఆయన కుమారుడు లోకేష్ మాత్రం విజయనగరం జిల్లా నెలిమర్లలో జరిగిన శంఖారావం సభలో ఏకంగా కుర్చీని మడత పెట్టి యాక్షన్‌తో సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ.. లోకేష్ దుయ్యబ్టటారు. అయితే.. లోకేష్ చేసిన యాక్షన్‌కు మంత్రి అంబటి రాంబాబుకు కూడా అదే స్థాయిలో రీకౌంటర్ ఇచ్చారు. "నాలుక మడత పడకుండా చూసుకో బాబూ లోకేష్.. కుర్చీ సంగతి తరువాత.." అంటూ ట్విట్టర్‌లో అంబటి రాసుకొచ్చారు.
అయితే.. ఇటీవల సోషల్ మీడియాలో కుర్చీ తాత డైలాగ్ "కుర్చీని మడబెట్టి" తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ డైలాగ్‌తో సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమా గుంటూరు కారంలో ఏకంగా ఓ పాటనే పెట్టేశాడు. కాగా.. ఇప్పుడు ఈ డైలాగును ఏపీలో రాజకీయ నాయకులు గట్టిగానే వాడేస్తున్నారు.